సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊహా నగరి ఫోర్త్ సిటీపై ఉన్న ప్రేమ… నిత్యం లక్షలాది మందికి ఆవాసమైన నార్త్ సిటీపై లేదని తేలిపోయింది. జనసంచారమే లేని ఫోర్త్ సిటీ ప్రాంతంలో పనులు చేపట్టేందుకే చూపుతున్న ప్రాధాన్యత.. నార్త్ సిటీపై లేకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఫేజ్-2లో నగరంలో మెట్రో విస్తరిస్తూ ఫోర్త్ సిటీకి కూడా డీపీఆర్‌పై ప్రకటన చేయగా, నార్త్ సిటీ జనాలు మాత్రం తమ ప్రాంతానికి మెట్రో ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
భూసేకరణ సులభం…
ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ వరకు నిర్మించనున్న 40 కిలోమీటర్ల మెట్రో మార్గానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తున్నది. ఈ ప్రాంతంలో భూసేకరణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నది. ఇప్పటివరకు ప్రాథమిక నివేదిక ప్రకారం.. నార్త్ సిటీ కంటే వేగంగా ఫోర్త్ సిటీలో భూసేకరణ పూర్తవుతుందని మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఎట్ గ్రౌండ్ విధానంలో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిసింది.
ఓ వైపు గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో… ఆ భూముల్లోనే మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. కానీ నార్త్ సిటీలో హెచ్ఎండీఏ ప్రకటించిన ఎలివేటెడ్ కారిడార్ కు భూసేకరణకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తొలుత రెండు మార్గాల్లోనూ ఎలివేటెడ్ కారిడార్‌లో మెట్రో ఉంటుందని భావించినా… ఒక మార్గంలో సాధ్యం కాని నేపథ్యంలో… ఎలివేటెడ్, మెట్రో ప్రాజెక్టులను వేర్వేరుగా చేపట్టే అవకాశం కూడా ఉందని తెలిసింది.
డీపీఆర్ సిద్ధం చేసి..
సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఊహానగరికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఈ ప్రాంతానికి జనసంచారమే లేకపోయినా కూడా ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు మొగ్గుచూపుతున్నది. 30 లక్షల మంది నివాసితులు, 5-6 లక్షల మంది నిత్యం రాకపోకలు సాగించే నార్త్ సిటీ కంటే ఫోర్త్ సిటీలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నది. ప్రస్తుతం నార్త్ సిటీ, ఫోర్త్ సిటీకి డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదించాల్సి ఉంది.