మేడ్చల్, జూన్ 26(నమస్తే తెలంగాణ): రైతులకు వానకాలం పంట పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నగదును మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో సోమవారం జమ చేసింది. మొదటి రోజు 17,448 రైతుల ఖాతాలలో రూ.4 కోట్ల 19 లక్షలను జమ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 47,506 రైతులు ఉండగా, రైతుబంధు పథకం ద్వారా రూ.40 కోట్ల 66 లక్షలను రైతులకు ప్రభుత్వం అందించనుంది. రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఎడాది ఎకరాకు రూ.10 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా చేశాడని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు నగదు ఆయా రైతుల ఖాతాల్లో జమ కావడంతో వ్యవసాయ పనులు ఇక మమ్మురం కానున్నాయి. వానకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్ మేరకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో వానకాలంలో 33,203 ఎకరాలలో వివిధ పంటలను సాగు చేసేలా రైతులు సిద్ధమయ్యారు.
వచ్చే నెల 3వ తేదీ వరకు నగదు..
రాష్ట్రంలో వ్యవసాయం విస్తీర్ణం పెరిగిదంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే. వ్యవసాయం రంగం గురించి అమితంగా తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టే వ్యవసాయ రంగం మరింత పురోభివృద్ధి సాధిస్తుంది. వ్యవసాయ రంగాన్ని అత్యాధునిక పద్ధతుల్లో ఫలవంతం చేసేందుకు ఆస్కారం ఉంది. వచ్చే నెల 3వ తేదీ వరకు రైతుబంధు నగదును జిల్లా వ్యాప్తంగా అందరికీ నగదును అందించేలా చూస్తాం.
– మేరి రేఖ, జిల్లా వ్యవసాయాధికారి,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
వ్యవసాయాన్ని పండగలా మార్చిన్రు..
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా మర్చిండు. పంట పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడు అయ్యిండు. గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం బంద్ చేసి కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చింది. రైతు బంధు పెట్టుబడి సాయంతో తిరిగి వ్యవసాయం చేస్తూ ఆనందంగా జీవిస్తున్నాం.
– సంజీవరెడ్డి, నర్సంపల్లి
అప్పుతో వ్యవసాయం చేసే రోజులు పోయాయి
అప్పు చేసి వ్యవసాయం చేసే రోజులు పోయి మంచి రోజులొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం రాక మునుపు వ్యవసాయం చేయాలంటే అప్పు చేయాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పెట్టుబడి సాయం అందించి వ్యవసాయం అంటే ఇష్టంగా చేసే విధంగా చేశాడు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించి రైతుల బాధలను తీర్చాడు. రైతుల కోసం అనేక సౌకర్యాలు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– పద్మారెడ్డి, నాగిశెట్టిపల్లి