Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్న చందానగర్ ఖజానా జ్యువెలరీ దుకాణం, కేపీహెచ్బీ కాలనీలోని 7వ ఫేజ్లో ఎంఐజీ 14లో నివాసముంటున్న రిటైర్డ్ తహసీల్దార్ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి భారీగా బంగారు ఆభరణాలను అపహరించుకు పోయిన సంగతి తెలిసిందే.
తాజాగా నగరం నడిబొడ్డున ఉన్న చిక్కడపల్లిలో భారీ చోరీ జరిగింది. చిక్కడపల్లిలో నివాసముంటున్న రిటైర్డ్ ఉద్యోగి నారాయణ ఇంట్లోకి శుక్రవారం తెల్లవారుజామున దొంగలు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 36 తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ చోరీపై నారాయణ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.