మహానగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ.. సాకారమవుతున్న ‘వ్యూహాత్మక’దారులతో నగరవాసులు ఊరట పొందుతున్నారు. నగరవ్యాప్తంగా రహదారులను సిగ్నల్ ఫ్రీ రోడ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) సత్ఫలితాలను ఇస్తున్నది. ముఖ్యమైన కూడళ్లలో ఫ్లైఓవర్లు, ఆర్యూబీ, ఆర్వోబీలు, అండర్‌పాస్‌ల ఏర్పాటుతో ట్రాఫిక్ చిక్కులు తప్పాయి. ఒకప్పుడు గంటల తరబడి.. ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులు.. నేడు సాఫీగా..నిర్ణీత సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు.
ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా నిర్మాణం ప్రారంభిస్తే అది పూర్తవ్వడానికి ఒకప్పుడు ఏండ్లకు ఏండ్లు పట్టేది..కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి అలసత్వానికి స్వస్తి పలుకుతూ..ఎదురయ్యే అన్ని ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమిస్తూ.. మౌలిక సదుపాయాల ప్రణాళికలను త్వరితగతిన పూర్తి చేస్తున్నది. ఇందుకు నగరంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) నిర్మాణాలే నిదర్శనం.
సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం తొలివిడతలో రూ. 5937 కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా..36 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 20 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో మూడు ఇతర పనులను పూర్తి చేశారు. ఇక మిగిలిన 11 ప్రాజెక్టుల్లో ఇతర శాఖలకు సంబంధించి మూడు పనులు మినహా, జీహెచ్ఎంసీ సంబంధించి 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అందులో ఒకటి మినహా మిగతావన్నీ ఈ ఏడాదిలో డిసెంబర్ నెలాఖరులో అందుబాటులోకి తీసుకురానున్నారు.
పథకం తొలి విడతలో భాగంగా ఇప్పటి వరకు రూ. 3248.53 కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు(ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు) అందుబాటులోకి తీసుకొచ్చారు.
రూ.3515.33 కోట్ల వ్యయంతో 11 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో 8 జీహెచ్ఎంసీ మూడు ఇతర శాఖలవి ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికల్లా ఎస్ఆర్డీపీ ఫేజ్-1 ఫలాలు పూర్తి స్థాయిలో అందనున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకం చేపట్టి అనతికాలంలోనే సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థగా మార్చారు. తొలివిడతలో రూ. 5937 కోట్లతో 47 చోట్ల ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను తీసుకుని, కేవలం తొమ్మిది సంవత్సరాల వ్యవధిలోనే 36 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. ప్రయాణం సాఫీగా జరగడంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతున్నది. అత్యధికంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, బాచుపల్లి, పటాన్చెరు, అబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి , జీడిమెట్ల కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు తొలగాయి.
ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ప్రీకాస్ట్ ఫియర్ క్యాప్ మెథడాలజీతో పనులు చేపట్టారు. గ్రౌండ్ లెవల్లో ఫ్లై ఓవర్ల స్పాన్లను కనిష్ఠంగా 30 మీ., గరిష్ఠంగా 50 మీ.డిజైన్ చేశారు. భూసేకరణ సమస్యలను నివారించేందుకు కోర్ సిటీలో స్టీల్ ఫ్లై ఓవర్లు చేపట్టారు.
ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, ప్రధాన కారిడార్లలో సమగ్ర పద్ధతిలో అభివృద్ధి చేశారు. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన చోట ప్రయాణ సమయం తగ్గింది. మొబిలిటి పెరిగింది. వాహనదారుల సిగ్నల్ రహిత ప్రయాణం సాగిస్తున్నారు. ఇంధనం ఆదా అవుతున్నది.
మరిన్ని రద్దీ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ఎస్ఆర్డీపీ రెండో దశకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ. 4,305 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ రెండో దశ ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది.