మేడ్చల్, నవంబర్16 (నమస్తే తెలంగాణ): భూధార్ కేటాయింపునకు సర్వే సాధ్యామవుతుందా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉన్న అన్ని భూములను ఒకే సర్వే నంబర్‌పై తీసుకువచ్చే భూధార్ కేటాయింపుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రైతుల భూములకు భూధార్ నంబర్ కేటాయించేందుకు జిల్లా అధికారులు 70 గ్రామాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదికలను సమర్పించారు. ఒక్కో రెవెన్యూ గ్రామంలో రైతులకు ఉన్న వివిధ సర్వే నంబర్లలోని భూములన్నింటిని ఒకే దగ్గర పొందుపరచి భూధార్ నంబర్‌ను కేటాయించనున్నారు. ఇందు కోసం రైతు సాగు భూములన్నింటినీ సర్వే చేసి రైతు భూమి భాగాలను వివరాలతో పాటు పూర్తి వివారాలతో పాటు సమాచారాన్ని ఆన్లైన్లో పొందపరుస్తారు.
భూ భారతి చట్టం తీసుకవచ్చిన అనంతరం రైతుల భూ సమస్యలపై అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 35వేలకు పైగా భూ సమస్యలపై దరఖాస్తులు రాగా.. దరఖాస్తులు స్వీకరించి 4 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు భూ సమస్యలు పరిష్కరించకపోవడం పలు అనమానాలకు తావిస్తోంది. భూసమస్యలను త్వరగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలోని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్ మండలాలలో భూధార్ సర్వేను నిర్వహించనున్నారు. ముందుగా పైలెట్ ప్రాజెక్ట్ కింద మేడ్చల్, రాజ బొల్లారం గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే నిర్వహిస్తున్నట్లు ఆధికారులు తెలిపారు. భూముల ఎంజాయ్మెంట్ (అనుభవిస్తున్న) భూములకు సంబంధించి సర్వే నిర్వహించి రైతులకు భూధార్ నంబర్లను కేటాయిస్తారు. ఆన్లైన్లో పొందపరిచిన వివరాలు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. సర్వే చేసిన పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరిస్తే భూధార్ నంబర్ జనరేట్ అవుతుంది.
జిల్లాలో సర్వే నిర్వహించేందుకు ఎంపిక చేసిన గ్రామాల వివరాలు, ప్రతిపాదనలకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందించాం. అయితే ప్రతిపాదనలు పంపించి 4నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు భూధార్ సర్వే నిర్వహణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. సర్వే కోసం మండలానికి ఇద్దరు సర్వేయర్లను నియమించమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే సర్వే పారంభిస్తామని అధికారులు పేర్కొన్నారు.