సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో పాదచారుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఈ మేరకు మహానగరంలో ప్రత్యేకంగా పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పటికే ఉప్పల్ చౌరస్తాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన స్కైవాక్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాగా, మెహిదీపట్నంలోనూ అదే తరహాలో స్కైవాక్‌ను నిర్మిస్తోంది. నిత్యం అత్యంత రద్దీగా మారిన ఈ ప్రాంతంలో పాదాచారుల కష్టాలను తీర్చేందుకు సుమారు 380 మీటర్ల పొడవుతో కూడిన అత్యాధునిక నిర్మాణ శైలిలో స్కైవాక్ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా చేపట్టింది. కోర్ సిటీ నుంచి ఐటీ కారిడార్ వెళుతున్న మార్గంలో ఉన్న మెహిదీపట్నం ప్రధాన వ్యాపార కేంద్రంగా మారడంతో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలో రోడ్లు దాటాలంటే నిమిషాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు హెచ్ఎండీఏ రూ.34 కోట్లతో స్కైవాక్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇప్పటికే రైతు బజార్‌కు ఇరువైపులా 170 మీటర్లు ఒకవైపు, మరోవైపు 180 మీటర్ల మార్గంలో పిల్లర్లను నిర్మించారు. ఇందులో ఆసిఫ్‌నగర్, గుడిమల్కాపూర్ ప్రాంతాలకు కూడలి నుంచి టోలిచౌకి వైపు వెళ్లే మార్గంలో పిల్లర్లపై స్టీల్‌తో రూపొందించిన డెక్‌లను బిగించారు.
మెహిదీపట్నం రైతు బజార్ ఎదురుగా ఉన్న బస్టాపు వైపు పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జీని నిర్మించి స్కైవాక్‌తో కలపాల్సి ఉంది. ఇటు వైపు రక్షణ శాఖ నుంచి పనుల నిర్వహించేందుకు అభ్యంతరం చెప్పడంతో కొన్ని నెలలుగా పనుల్లో జాప్యం జరిగింది. పీవీ ఎక్స్‌ప్రెస్ వే ఒక వైపు మినహా మిగతా యూ ఆకారంలో పనులను హెచ్ఎండీఏ శరవేగంగా నిర్వహిస్తోంది. స్కైవాక్‌కు సంబంధించిన ప్రీ ఫ్యాబ్రికేడ్ నిర్మాణాలు చేసి, ఇక్కడ బిగిస్తున్నారు. రక్షణ శాఖతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరపడంతో సానుకూలంగా స్పందించి స్కైవాక్ నిర్మాణానికి అంగీకరించినట్లు తెలిసింది. రక్షణ శాఖ స్థలం వైపు 10 మీటర్ల ఎత్తు, 50 మీటర్ల పొడవుతో కూడిన వ్యూ కట్టర్‌ను ఏర్పాటు చేయాలని సూచించడంతో ఆ పనులు హెచ్ఎండీఏ చేపట్టింది. ఈ పనులకు ప్రత్యేకంగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం వ్యూ కట్టర్‌కు సంబంధించిన నిర్మాణం పనులు నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రక్షణ శాఖ ఇచ్చే అనుమతులకు అనుగుణంగా మిగతా పనులు పూర్తి చేసి, పాదాచారులకు అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.