సిటీబ్యూరో: మార్కెట్లో అమ్మకాలు లేవు. ప్రభుత్వ విధానాలతో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. ఇక భూములను వేలం వేయడం కంటే… ముందుగా భూములను సమీకరించుకోవడమే ఉత్తమమనే భావన హెచ్ఎండీఏ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. కొంత కాలంగా ల్యాండ్ పూలింగ్ వ్యవహారం పెండింగ్లో పడిన నేపథ్యంలో.. తాజాగా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో ఒక్కటైనా పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ముఖ్యంగా చివరి దశలో ఉన్న కొర్రెముల భూములను రైతుల నుంచి సేకరించి ఒక్కటైనా విజయవంతంగా పూర్తి చేస్తే సరిపోతుందనే భావనలో ఉన్నారు. ఓ వైపు మార్కెట్ పరుగులు పెడుతుందని, క్రయవిక్రయాలు జోరందుకున్నాయంటూ ప్రభుత్వ వర్గాలు ఊదరగొడుతున్నా… క్షేత్రస్థాయిలో అమ్మకాల తీరు తిరోగమనంలోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో… చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ల్యాండ్ పూలింగ్ ద్వారా కనీసం 300 ఎకరాలను సేకరిస్తే సరిపోతుందని అనుకుంటున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా రియల్ మార్కెట్ డౌన్ ట్రెండ్ కొనసాగుతున్నది. అయితే ల్యాండ్ ఫూలింగ్ ప్రక్రియను దశల వారీగా పూర్తి చేయాలని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నగర శివారులో 900 ఎకరాల భూములను సమీకరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో మేడ్చల్, రంగారెడ్డి
జిల్లాల పరిధిలో పలు ప్రాంతాలను ఎంపిక చేసుకోగా, ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేశారు. ఇందులో ప్రధానంగా మేడ్చల్ జిల్లా పరిధిలోని కొర్రెములలో దాదాపు 300 ఎకరాలు సమీకరించాలనేది ప్రస్తుత లక్ష్యమని తెలిసింది.
హెచ్ఎండీఏ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భూ సమీకరణ చేయాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా పెండింగ్లో ఉండటానికి ప్రధాన కారణాల్లో గిట్టుబాటు ధర లేకపోవడం. గడిచిన పదేండ్లలో భూముల ధరలు రాకెట్ వేగంతో పెరగడంతో… భూములు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 40 శాతం నుంచి 60 శాతానికి పరిహారాన్ని పెంచినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో పలు దఫాలుగా రైతులతో సంప్రదింపులు, నోటిఫికేషన్లు జారీ చేసినా… ఆచరణలో సాధ్యం కాలేదు. ఇలాంటి నేపథ్యంలోనే కొర్రెముల ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేయడం వల్ల మార్కెట్ ఆటుపోట్లకు సమాధానం దొరుకుతుందని హెచ్ఎండీఏ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో తొలి దశలో 300 ఎకరాల భూమిని తీసుకుంటే సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాతే అబ్దుల్లాపూర్మెట్, కుత్బుల్లాపూర్, బాలాపూర్ మండలాల పరిధిలో భూ సమీకరణ చేపట్టాలనే ప్రణాళికలు ఉన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఉన్న ప్రతికూల మార్కెట్ పరిస్థితుల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుందని హెచ్ఎండీఏ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.