దేశంలో గుణాత్మక మార్పే.. భారత రాష్ట్ర సమితి లక్ష్యమని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అన్నారు.
అణగారిన వర్గాలను ప్రభుత్వాలు విస్మరించడం వల్లనే దేశానికి ఈ గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనతికాలంలోనే
తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నప్పుడు దేశంలోని మిగిలిన రాష్ర్టాలు, దేశం ఎందుకు పురోగమించడంలేదని ప్రశ్నించారు. ఈ దుస్థితిని మార్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. మంగళవారం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పండరీపూర్ నియోజకవర్గం పరిధిలోని సర్కోలీ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. పండరీపూర్‌కు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కేతోపాటు ఆయన అనుచరులు వందలాది మంది కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి అంటే ప్రజల టీం అని స్పష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనేది కేవలం నినాదం కాదని అది విధానమని చెప్పారు. కేవలం మహారాష్ట్ర రాజకీయాలను.. పరిస్థితులనే కాదు యావత్ దేశ గతిని మార్చటమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కార్ వస్తే తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఉన్న సీఎం కేసీఆర్ తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ విఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.