Ganja | చార్మినార్, మార్చ్ 11: గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయానే విశ్వసనీయ సమాచారం అందడంతో ఓ ఇంటిపై దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందే శ్రీనివాస రావు తెలిపారు. అదనపు డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాంపూర్‌కు చెందిన మహమ్మద్ యాసిన్ అధిక ఆదాయం పొందడానికి గంజాయిని సరఫరా చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. జైలుకు వెళ్లిన పద్దతి మార్చుకోకుండా తన వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల జైలు నుంచి విడుదలై హైదరాబాద్ హుస్సేనీ ఆలంలోని ముర్గీచౌక్‌లో నివాసం ఉంటున్నాడు. ఇక్కడ ఒక సెలూన్‌ను లీజుకు తీసుకుని జీవనోపాధి పొందుతున్నట్లు అందరిని నమ్మించాడు. సెలూన్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోక పోవడంతో తిరిగి గంజాయి సరఫరా ప్రారంభించాడు.
తన పాత సహచరులు ఒడిశా రాష్ట్రానికి చెందిన గోపాల్, ఉత్తమ్లతో కలిసి అక్కడ 30 కేజీ ల గంజాయిని కొనుగోలు చేసి నగరానికి వచ్చారు. గంజాయిని ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన కిషన్ అనే వ్యక్తికి విక్రయించేందుకు సిద్ధం చేసుకున్నారు. వీరి వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హుస్సేని ఆలం పోలీసులతో కలిసి నిందితుని ఇంటిపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో 30 కేజీల గంజాయితోపాటు యాసిన్, గోపాల్, ఉత్తమ్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరో నిందితుడు కిషన్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశం లో సౌత్-ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ సైదాబాబు, హుస్సేనిఆలం ఇన్స్పెక్టర్ సురేందర్, ఎస్ఐలు పి సాయిరాం, ఎం మధు తదితరులు పాల్గొన్నారు.