Hyderabad | కొండాపూర్, డిసెంబర్ 1 : హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్రి ప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 30 గుడిసెలు దగ్ధమయ్యాయి.
సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ జవహర్ కాలనీలో ఎస్బీఎస్ యాంపిల్ హోమ్స్ అపార్ట్మెంట్ నిర్మిస్తున్న కార్మికులు.. దాని పక్కనే గుడిసెలు వేసుకున్నారు. వాటిలో సోమవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు గుడిసెలకు అంటుకున్నాయి. అయితే ఆ సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో 30 గుడిసెలు, వాటిలోని సామాన్లు కాలిబూడిదయ్యాయని డీఎస్ఓ నాగేశ్వరరావు తెలిపారు.