Hyderabad | హైదరాబాద్ అంబర్‌పేటలో విషాదం నెలకొంది. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు సహా పదేళ్ల కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో తెరిచి చూడటంతో కుళ్లిన స్థితిలో మృతదేహాలు కనిపించాయి. రెండు రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకుని ఉంటారని తెలుస్తోంది. మూఢనమ్మకాలే వీరి మరణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ రామ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మీ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె నాలుగేళ్ల క్రితం మరణించింది. దీంతో మిగిలిన ముగ్గురు డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. మానసికంగా కుంగిపోవడంతో పాటు కూతురు గుర్తొస్తుండటంతో అక్కడ ఉండలేకపోయారు. కొద్ది నెలల క్రితమే ఆ కుటుంబం రామ్‌నగర్ నుంచి అంబర్‌పేటకు షిఫ్టయ్యారు. అంబర్‌పేటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇరుగుపొరుగు వారితో వాళ్లు పెద్దగా మాట్లాడేవారు కాదు. అయితే శ్రీనివాస్ అక్క తరచూ వచ్చేదని.. ఆమెనే తమకు ఈ విషయాలు చెప్పారని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో స్థానికులు కూడా పట్టించుకోలేదు. అయితే శ్రీనివాస్ వాళ్ల అక్క ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పక్కింటి వారికి సమాచారం అందించింది. పైగా శ్రీనివాస్ ఇంటి నుంచి కూడా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇలా ఇంట్లోకి వెళ్లి చూడగా.. మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి.
అప్పుల బాధతోనే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మూఢ నమ్మకాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. “మమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. మేం కూడా దేవుడి దగ్గరకు వెళ్తాం” అని తమతో శ్రీనివాస్ కుటుంబం చెప్పేదని స్థానికులు చెబుతున్నారు.