Self help group | హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీలకు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.15,037 కోట్ల రుణాలను అందజేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. దీంతో 3.08 లక్షల ఎస్‌హెచ్‌జీలకు లబ్ధి చేకూరనున్నది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 18,905 సంఘాలకు రూ.1,032 కోట్లు ఇవ్వనున్నారు. ఖమ్మం జిల్లాలో 16,642 సంఘాలకు రూ.931 కోట్లు, నల్లగొండ జిల్లాలో 19,893 సంఘాలకు రూ.911 కోట్ల రుణాలను అందజేయనున్నారు.
తదనుగుణంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం సూచించడంతో మండలాలవారీ లక్ష్యాలను జిల్లా అధికారులకు పంపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4.60 లక్షలకుపైగా ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వీటిలో 46 లక్షల మందికిపైగా సభ్యులున్నారు. సెర్ప్ ద్వారా వీరిని సంఘటితం చేసి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఒక్కో సంఘానికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షల వరకు రుణాన్ని అందజేస్తున్నది. ఈ రుణాలకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తున్నది.
నిరుడు లక్ష్యానికి మించి రుణాలు
గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు రూ.12 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సెర్ప్ మొత్తంగా 2.25 లక్షల సంఘాలకు రూ.12,722 కోట్ల రుణాలను అందజేసింది. వీటిలో మొండి బాకీలు (ఎన్పీఏలు) 1.92 శాతంగా ఉన్నాయి. వాటిని 1.85 శాతానికి తగ్గించాలని అధికారులు ఆదేశించారు. గిరిజన జిల్లాల్లో ఎన్పీఏలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 5.48% మొండి బాకీలు ఉన్నట్టు వెల్లడించారు. ఆ తర్వాతి స్థానాల్లో మహబూబాబాద్ (4.93%), వికారాబాద్ (4.56%), కుమ్రంభీం ఆసిఫాబాద్ (4.49%), ములుగు (3.71%), నారాయణపేట (3.45%), ఆదిలాబాద్ (3.35%), గద్వాల (3.09%) జిల్లాలు ఉన్నట్టు వివరించారు.