ఉస్మానియా యూనివర్సిటీ: సేవాలాల్ ఆశయాలు, లక్ష్యాలను సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కంకణ బద్దులై ఉండాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ పిలుపునిచ్చారు. ఆ దిశగా శ్రమించి బంజారా జాతిని ముందుకు నడిపే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని (Sevalal Jayanti) పురస్కరించుకొని గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు శుక్రవారం 2కే రన్ నిర్వహించారు. ఈ రన్ ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్తో కలిసి రామచంద్రనాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాంచందర్ నాయక్ మాట్లాడుతూ.. బంజారాల అభివృద్ధికి సేవా లాల్ చేసిన కృషిని కొనియాడారు. ఆయన జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాలని కోరారు. గిరిజన సమాజమంతా జ్ఞానం వైపు మరలాలని, అది విద్య ద్వారానే సాధ్యమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్ని జిల్లాలు, అన్ని యూనివర్సిటీలలో సేవా లాల్ జయంతిని ఘనంగా నిర్వహించేలా తమ కార్యాచరణ ఉంటుందని గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ అన్నారు. గిరిజన,ఆదివాసి సోదరులు అందరూ ఐక్యంగా నడిస్తే భవిష్యత్తులో అన్ని హక్కులను సాధించుకోవచ్చన్నారు. 2k రన్ లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.