సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): రోడ్డు భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వాహనదారులపై సిటీ ట్రాఫిక్ పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జూన్ 12,13 తేదీలలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. నగరవ్యాప్తంగా చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 281 మంది వాహనదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడినవారిలో 219 మంది ద్విచక్ర వాహనదారులు , 30 మంది ఆటోరిక్షాలు , 32 మంది కార్లు, ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు ఉన్నారని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా మల్కాజిగిరి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేకంగా వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రెండు కమిషనరేట్ల పరిధిలో 77 మంది మందుబాబులను పట్టుకున్నారు. మల్కాజిగిరిలో 124 మంది, సైబరాబాద్‌లో 53 మంది ఉన్నారు. అత్యధికంగా 11 మందికి 300 కంటే ఎక్కువవగా బీఏసీ స్తాయి నమోదైనట్లు అధికారులు తెలిపారు.