కేశంపేట, ఫిబ్రవరి 21: రంగారెడ్డి జిల్లా కేశంపేటలో (Keshampet) విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్ (28) టీఫైబర్ కేబుల్ నెట్వర్క్లో ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ నెల 13న విధుల్లో భాగంగా కేశంపేట మండలం అల్వాల రోడ్డులో కేబుల్ వైరును సరి చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో స్థానికులు అతడిని 108 అంబులెన్సులో ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడడంతో ప్రవీణ్ తల్లిదండ్రులు చెవిటి జంగమ్మ, జంగయ్యలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కుటుంబాన్ని నడిపే పెద్దదిక్కును కోల్పోయిన బాధిత కుటుంబాన్ని దాతలు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.