సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): ‘సఫాయన్నా…నీకు సలామన్నా’ నినాదంతో పారిశుధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి సర్కారు నిబద్ధతతో పనిచేస్తున్నది. తాజాగా మే డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలను నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో 25,613 మంది కార్మికులకు, జలమండలిలో 4వేల మంది కార్మికులకు లబ్ధి జరగనుంది. కాగా పెరిగిన వేతనాలపై జీహెచ్ఎంసీ ఖజానాపై నెలకు రూ. 2.5 కోట్లు, జలమండలికి దాదాపు రూ. 60 లక్షలకు పైగా భారం పడనుంది. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంను స్వాగతిస్తూ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
పారిశుధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే మూడు సార్లు వేతనాలు పెంచారు. 16 జూలై 2015లో రూ. 12,506 , 23 మే 2017లో రూ.14,500, 15 నవంబర్ 2020లో మూడోసారి పెంచింది. ప్రస్తుతం కార్మికుల నెలవారీ వేతనం రూ. 17వేలకు చేరగా..తాజాగా పెంచిన వెయ్యి రూపాయలతో రూ.18వేలకు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికుడి నెల జీతం రూ. 8, 500 ఉండేది. జీహెచ్ఎంసీ పరిధిలో 25, 613 మంది కార్మికుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపింది. పారిశుధ్య కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 6 లక్షలు, శాశ్వతంగా వైకల్యం చెందితే రూ. 3 లక్షలు, సాధారణ మరణం చెందితే రూ. 3 లక్షలు అందిస్తున్నది. ఇక జలమండలి పరిధిలో 4వేల మంది కార్మికులు ఉండగా..వారికి మూడు కేటగిరిల్లో జీతాలు అందుతున్నాయి. స్కిల్డ్కు రూ. 19వేలు, సెమిస్కిల్డ్కు రూ. 15000, ఆన్స్కిల్డ్కు రూ. 12వేలు అందుతుండగా..వీరికి అదనంగా నెలకు రూ.1000 జీతం రానుంది.
