చిక్కడపల్లి, ఫిబ్రవరి 19- తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారందరికీ 250 గజాల స్థలం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఉద్యమకారుల జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రఫుల్ రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జేఏసీ గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ ఉద్యమకారుల కు 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉద్యమంలో పని చేసి లబ్ధి పొందని కళాకారులను సాంస్కృతి సారథిలోని వివిధ పోస్టులలో అవకాశం ఇవ్వాలని, ఉచిత బస్సు పాసులు 250 గజాలు ఇంటి స్థలంలో పాటు 4 గదుల ఇల్లు నిర్మించి అందజేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలలో ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఇతర రాష్ర్టాల్లో ఉద్యమకారులకు ఆర్థిక సహకారాలు అందిస్తున్నట్లుగా తెలంగాణ ఉద్యమకారులకు నెలకు 30000 గౌరవ వేతనాన్ని ప్రతినెలా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు సోమన్న, యాదగిరి ,చంద్రన్న ప్రసాద్, మాధవి ,యాదగిరి ,ఏ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.