బుధవారం 27 మే 2020
Hyderabad - Apr 28, 2020 , 00:00:28

గ్రేటర్‌లో కొత్తవి రెండే కేసులు

 గ్రేటర్‌లో  కొత్తవి రెండే కేసులు

  • నియంత్రిత ప్రాంతాల్లో 65 వేలమంది
  • విస్తృతంగా వైద్య పరీక్షలు, నిత్యావసరాల పంపిణీ
  • మొత్తం పాజిటివ్‌ కేసులు 524
  • ప్రస్తుతం 349 యాక్టివ్‌ కేసులు
  • 224 పాజిటివ్‌ కేసులతో టాప్‌లో చార్మినార్‌
  • 176 కేసులతో రెండో స్థానంలో ఖైరతాబాద్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి చేపడుతున్న పకడ్బందీ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సోమవారం గ్రేటర్‌లో 2 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కంటైన్మెంట్‌లో ఉన్నవారు బయటకు వెళ్లకుండా.. ఇతరులు లోపలికి ప్రవేశించకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. వారి ఇంటివద్దకే వారికి కావాల్సిన నిత్యావసరాలు అందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆయా ప్రాంతాల్లో రెండు పూటలా పారిశుధ్య పనులు చేపడుతూ రసాయనాలు పిచికారి చేస్తున్నారు. ఓ వైపు గడువు పూర్తయిన కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేస్తూ..కొత్తగా కేసులు నమోదైతే  ఆయా ప్రాంతాలను నియంత్రిత జోన్లుగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి విస్తృతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న సుమారు 65వేలమందికి నిత్యావసరాలతోపాటు వైద్యసేవలందుతున్నాయి. తాజాగా సోమవారం నాటికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 128కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతుండగా, మొత్తం 524 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 349 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరికి గాంధీ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. 

అధికార వర్గాల సమాచారం ప్రకారం..

చార్మినార్‌ జోన్‌ 224పాజిటివ్‌ కేసులతో ప్రథమ స్థానం, ఖైరతాబాద్‌ 176 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు మినహా మిగిలిన జోన్లలో నామమాత్రంగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 128కంటైన్మెంట్‌ జోన్లలో 524పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 347కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరు 1602మందిని కాంటాక్ట్‌ అయినట్లు గుర్తించి వారిలో 100మంది నుంచి శాంపుల్స్‌ సేకరించారు. రిపోర్టులు రావాల్సివుంది. ఈ జోన్లలో 14677 ఇండ్లు ఉండగా, వాటిలో 64925మంది నివసిస్తున్నారు. ఈ మొత్తం జోన్ల వైశాల్యం 35.55కిలోమీటర్లు. ఇందులో మర్కజ్‌ నుంచి వచ్చినవారితో కాంటాక్ట్‌ అయినవారు 264మంది ఉండగా, ఇంటింటి సర్వే కోసం 189బృందాలను వినియోగిస్తున్నారు. 

మలక్‌పేట: మలక్‌పేట అక్బర్‌బాగ్‌ డివిజన్‌ ప్రొఫెసర్స్‌ కాలనీలో మహిళ, ఇద్దరు హోల్‌సేల్‌ పంచదార వ్యాపారులు, వారి కూతురికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీకి తరలించారు. వారి నివాసిత ప్రాంతాలను కొవిడ్‌ 19 నియంత్రిత ప్రదేశంగా ఏర్పాటు చేశారు. 

ఎల్బీనగర్‌ : మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్‌లో పల్లీ వ్యాపారం చేసే గడ్డిఅన్నారం శారదానగర్‌ వాసికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో గాంధీకి తరలించారు. అతడి భార్య, ఇద్దరు పిల్లలతోపాటు సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని 9, కర్మన్‌ఘాట్‌, వనస్థలిపురంలో మరో 9 మంది బంధువులను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. బాధితుడి నివాసం చుట్టూ సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లించి  ఆయా ప్రాంతాల్లోని 100  మంది నివాసితులకు పరీక్షలు చేయనున్నట్లు ఉప కమిషనర్‌ హరి కృష్ణయ్య తెలిపారు. ఏప్రిల్‌ 17న బాడీ పెయిన్స్‌తో వనస్థలిపురం జీవన్‌సాయి దవాఖానలో చికిత్స అనంతరం సోమాజిగూడలోని యశోధ దవాఖానలో చికిత్స పొందాడు.

మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన 3 కిలోమీటర్ల పరిధిలో మండల ప్రాథమిక వైద్యాధికారి రెడ్డి కూమారి ఆధ్వర్యంలో సర్వే చేపడుతూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌లోని 16వందల ఇండ్లలో సర్వేను నిర్వహిస్తున్నారు.


logo