SNDP | విజన్ ఉండాలే కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ మినహా ఖమ్మం, ఇతర పట్టణాల్లో వరద ముంపునకు జనం విలవిలలాడుతున్నారు. నిద్రలేని కాలరాత్రులు గడుపుతున్నారు.
కూడు, గూడు లేకుండా జనం అల్లాడిపోతున్నారంటే.. వరద ముంపు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే రెండు సెంటీమీటర్ల వర్షానికే అతలాకుతలమయ్యే హైదరాబాద్ మహా నగరం..ప్రస్తుతం ఎంతటి వర్షపాతం నమోదైనా తట్టుకుంటున్నది. దీని కారణం ఎస్ఎన్డీపీ. ఈ ప్రాజెక్టు పూర్తయిన చోట వరద నీరు సాఫీగా నాలాల ద్వారా మూసీలోకి చేరుతున్నది.
నాటి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నేడు మహా ఉపశమనం లభించింది. ఒకప్పుడు భారీ వర్షాలు, వరదలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యేవి. జనజీవనం అస్తవ్యస్తమయ్యేది. 2020 అక్టోబర్ నాటి కుండపోత వర్షాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్ఎన్డీపీ) చేపట్టి.. మహానగర వరద ముంపు కష్టాలను శాశ్వతంగా దూరం చేశారు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ )
సరిగ్గా వందేండ్ల తర్వాత అక్టోబర్ 2020 సంవత్సరంలో కురిసిన కుండపోత వర్షాలతో (20 సెంటీమీటర్లు) గ్రేటర్ జనజీవనం అతలాకుతలమైంది. ఇండ్లు, కాలనీల్లో వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు బతుకుజీవుడా అంటూ జీవనం సాగించారు. దాదాపు 40వేల కుటుంబాలు అల్లాడిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్‌లోనూ కుండపోత వర్షాలు కురిసినా.. ప్రజలకు వరద నీటి ప్రభావం లేకుండా ఉండేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది.
అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ కేటీఆర్ సారథ్యంలో వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకానికి (ఎస్ఎన్డీపీ) శ్రీకారం చుట్టారు. ఎస్ఆర్డీపీ ఫేజ్-1 కింద రూ.985.45కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెరువులు, కుంటలు, తూముల అభివృద్ధి తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట్ల కొత్త నిర్మాణాలు, కుచించుకుపోయిన చోట నాలా విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతానికి చర్యలు చేపట్టారు. ఫలితంగా తొలి విడతగా చేపట్టిన ఎస్ఎన్డీపీలో భాగంగా 58 చోట్ల చేపట్టిన పనుల్లో 41 ప్రాంతాల్లో పూర్తయ్యాయి.
69.48 కిలోమీటర్ల పనుల్లో 42.48 కిలోమీటర్ల మేర పూర్తి కావడంతో 175 కాలనీలు లబ్ధి పొందాయి. 4 లక్షలకు పైగా కుటుంబాలు వరద ముంపు నుంచి శాశ్వతంగా భరోసా దక్కింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చోటా నాలా పనులను పూర్తి చేయలేదు..పురోగతిలో ఉన్న వాటిని పట్టించుకోలేదు. నేటికీ 17 చోట్ల పనులు నత్తనడకన జరుగుతుండటంతో ఆ ప్రాంతాల్లో వరద కష్టాలు తప్పడం లేదు.రెండు రోజుల కిందట అల్లాపూర్, కూకట్‌పల్లిలో 20 ఇండ్లు నీట మునగడానికి నత్తనడకన సాగుతున్న నాలా పనులే నిదర్శమని అధికారులే పేర్కొనడం గమనార్హం.