మేడ్చల్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రేషన్ షాప్‌లలో 3 నెలలుగా నిల్వఉన్న దొడ్డు బియ్యం పరిస్థితి ఎంటన్నది ప్రశ్నార్థకరంగా మారింది. రేషన్‌కార్డుదారులకు సన్న బియ్యం ఇస్తుండటంతో ఇదివరకు రేషన్ షాపుల్లో నిల్వఉన్న దొడ్డు బియ్యం అలాగే ఉండిపోయాయి. ఆ నిల్వలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు వాటిని ఏం చేయాలని డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని రేషన్ దుకాణల్లోనే 1.704 మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యం నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం తిరిగి తీసుకుంటుందా లేదా ఇతరులకు విక్రయించేందుకు టెండర్లు నిర్వహిస్తుందా అనే విషయమై స్పష్టత లేకపోవడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. మరికొన్ని రోజుల దొడ్డుబియ్యం రేషన్ దుకాణాలలో ఉన్నట్లయితే ముక్కిపోయే అవకాశం ఉందని రేషన్ డీలర్లు అందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 5,28,881 రేషన్‌కార్డుదారులు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని.. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలలో 5,28,881 రేషన్‌కార్డులు ఉండగా 618 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో రేషన్ దుకాణాలకు 11,340 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశారు.
రేషన్ డీలర్లు ఆహార భద్రత కార్డుదారులకు 9,636 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించారు. ఇంకా 1,704 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ దుకాణాలలోనే ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం జూన్ నెలలోనే మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో.. ఇదివరకు మిగిలిపోయిన దొడ్డుబియ్యాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. దొడ్డు బియ్యానికి సంబంధించి టెండర్లు నిర్వహిస్తారా లేక ప్రభుత్వమే వెనక్కు తీసుకుంటుందా అని అధికారులతో పాటు డీలర్లు ఎదురుచూస్తున్నారు.
కుంభకోణం బయటకు పొక్కడంతో..
ఇటీవల మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరిగిన బియ్యం కుంభకోణం బయటకు పొక్కడంతో దొడ్డు బియ్యం విషయంలో అధికారులు, డీలర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కాప్రా, రామంతపూర్ ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద నుంచి లారీల్లో తరిలిన 900 క్వింటాళ్ల బియ్యం అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. అంతేకాక జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ సుగుణబాయికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రేషన్ దుకాణాలలో నిల్వఉన్న దొడ్డుబియ్యాన్ని అక్రమ మార్గంలో తరలించే అవకాశం ఉందో అనే అనుమాలకు తావిస్తోంది.