ప్రభుత్వం నగరంలో 163 ఆంక్షలు విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలిసి కట్టుగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ వేళ.. ఆంక్షల పేరిట నగరవాసుల సంతోషాలను కట్టడి చేసేందుకు ్రప్రయత్నిస్తున్నది. సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాలు వరుస ఆందోళనలు చేస్తుండటంతో సర్కారు జంకుతున్నది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దంటూ.. నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చి పరోక్షంగా కర్ఫ్యూ విధించిందనే విమర్శలు వస్తున్నాయి.
-సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
ఓ వైపు బెటాలియన్ పోలీసుల ఆందోళన… మరో వైపు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసే యోచనలో ఉన్న హోంగార్డులు.. వీళ్లతో పాటు మరిన్ని వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఒకరి వెంట ఒకరు ఆందోళన బాటపడుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండటంతో ఏ వర్గం నుంచి మెరుపు ఆందోళనలు ఎక్కడ జరుగుతుందననే భయం ప్రభుత్వానికి ఉన్నదన్న చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 163 సెక్షన్(144)ను అమలు చేస్తుండటంతో దీపావళి పండుగ వేళ స్నేహితులు, కుటుంబ సభ్యులు, కాలనీల్లో కలిసికట్టుగా ఆనందోత్సవాల్లో చేసుకునే పరిస్థితికి దూరమవుతామని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో శాంతి యుత ఆందోళనలు ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వరకే పరిమితమని, నెల రోజుల పాటు నగర వ్యాప్తంగా 163 ఆంక్షలు అమలు చేస్తున్నా. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడవద్దంటూ హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చి పరోక్షంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందనే విమర్శలు వస్తున్నాయి.
నిర్ణీత ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే అక్కడ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఇలా ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో అప్పుడప్పుడు పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తుంటారు. వారం రోజుల పాటు అమలు చేస్తూ వాటిని అవసరమైతే పొడిగిస్తూ వెళ్తారు. అయితే ఏకంగా నెల రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఈ ఆంక్షలు అమలులోకి తేవడంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్నేహితుల, బంధువులతో వెళ్లి పటాకులు కొనలేని పరిస్థితి.. కలిసి పటాకులు కాల్చుకోలేని దుస్థితి. కలిసికట్టుగా షాపింగ్ చేయకుండా ఇలా కట్టడి చేయడం ఏమిటంటూ.. నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని వర్గాలకు హామీలు ఇచ్చింది.. ఆ హామీలను నెరవేర్చలేక చేతులేత్తిసింది… మరో వైపు హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ పేర్లతో పేదవారికి కంటినిండా నిద్రలేకుండా చేసింది. ఇంతలోనే ఏకంగా పోలీసు వ్యవస్థలో అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటూ బెటాలియన్ ఫోర్స్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించడంతో వారంతా ప్రభుత్వ తీరుపై నిరసన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్లలో పోలీసులు ఆందోళన చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటు ఎగుర వేశారు. ఇదిలా ఉంటే హోంగార్డులు సైతం ప్రభుత్వంపై రగిలిపోతున్నారు.
ఇటీవల హోంగార్డులు చాలీచాలని జీతాలు, వచ్చే జీతాలు కూడా సమయానికి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భంగా గోషామహల్ స్టేడియం నుంచి పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..కనీసం హోంగార్డుల పేరు కూడా ప్రస్తావించ లేదు. ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చిన సీఎం.. మమ్మిల్ని మర్చిపోయారంటూ హోం గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెటాలియన్ సిబ్బంది ఆందోళన బాట పట్టడంతో ఇప్పుడు సెక్యూరిటీ బాధ్యతలు మొత్తం ఏఆర్, సివిల్ పోలీసులకు అప్పగిస్తున్నారు.
‘దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లో ఆంక్షలు విధించలేదు. కొన్ని వర్గాలు వివిధ రకాలుగా ఆందోళనలకు ప్రయత్నిస్తున్నాయి. సచివాలయం, సీఎం ఇల్లు, డీజీపీ ఆఫీస్, రాజ్‌భవన్ తదితర కేంద్రాల వద్ద అకస్మాత్తుగా ఆందోళనలు చేసే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ నివేదిక రావడంతో నోటిఫికేషన్ ఇచ్చాం. ఇది పోలీసులు తీసుకునే చర్యలకు న్యాయపరంగా మద్దతు ఉంటుంది. ఆందోళన కారులను అరెస్ట్ చేసేందుకు అవకాశముంటుంది. ఇది దేశ వ్యాప్తంగా పోలీసులు చర్యలో సాధారణ ప్రక్రియలో భాగం. ఇది కర్ఫ్యూ కాదు.. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆనందోత్సవాలతో పండుగలు జరుపుకోవాలి’ అంటూ సీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. – హైదరాబాద్ సీపీ, సీవీ ఆనంద్ ట్వీట్