Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్లను బదిలీలు చేస్తూ.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగర పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు, జోన్లను, డివిజన్లను పునర్వ్యవస్థీకరిస్తూ.. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ బదిలీలు జరగడంతో పోలీస్ కమిషనరేట్‌ను ప్రక్షాళన చేసినట్లయింది. నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న 146 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు.
పునర్వ్యవస్థీకరణకు సంబంధించి బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో జోన్లు, డివిజన్లు, పీఎస్‌ల మార్పులతో పాటు బదిలీలకు సంబంధించి సీపీ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ విభాగంతో పాటు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లను కూడా పెద్ద ఎత్తున బదిలీ చేయడం, ప్రతీ జోన్‌కు ఒక సైబర్ క్రైమ్ సెల్‌ను ఏర్పాటు చేసి.. వీటికి ఒక్కో ఇన్స్పెక్టర్ను ఏర్పాటు చేయడం ద్వారా సైబర్ విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని నగర కమిషనర్ పేర్కొన్నారు.