Drunken Drive | హైదరాబాద్ : సైబరాబాద్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల సందర్భంగా ఒక్క జులై నెలలోనే 1318 మంది పట్టుబడినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఇందులో 38 మందికి జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మరో 31 మందికి జరిమానా విధించారు. ఇక శనివారం రాత్రి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో 120 మంది పట్టుబడినట్లు తెలిపారు. 71 మంది బైకర్లు, నలుగురు ఆటో డ్రైవర్లు, 43 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు, ఇద్దరు హెవీ వెహికల్ డ్రైవర్లు ఉన్నారు.
106 మంది నిందితుల రక్తంలో ఆల్కహాల్ సాంద్రత 35 mg/100 ml నుండి 200 mg/100 ml వరకు ఉంది. మరో ఎనిమిది మందికి 201 mg/100 ml నుండి 300 mg/100 ml వరకు ఉంది. ఇంకో ఆరుగురిలో 301 mg/100 ml నుండి 500 mg/100 ml వరకు ఉన్నాయి. వీరందరిని కోర్టు ముందు హాజరు పరిచి శిక్ష విధిస్తామన్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ప్రాణాంతక ప్రమాదానికి కారణమైతే, వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయబడుతుంది. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 10 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధించబడును.