మేడ్చల్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్ని వార్డులుగా ఏర్పడనున్నాయో అన్న దానిపై ప్రజలతో పాటు నాయకులు దృష్టి సారించారు. జీహెచ్ంఎసీల వార్డు విభజనకు సంబంధించి ఇప్పటికే అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలో వార్డుల విభజనకు సంబంధించి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 13 మున్సిపాలిటీలకు సంబంధించి 13 మంది చైర్మన్లు, 13 వైస్ చైర్మన్లు, ఒక్కో మున్సిపాలిటీల్లో సుమారు 25 నుంచి 30 వరకు కౌన్సిలర్లు ఉండగా, ఇప్పుడు అ సంఖ్య పూర్తిగా తగ్గి మున్సిపాలిటీలకు ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులను ఏర్పాటు చేయనున్నారు. మున్సిపాలిటీలకు ఒకటి నుంచి రెండు మాత్రమే వార్డులు ఏర్పడే అవకాశం ఉంటుందని అధికారుల నుంచి సమాచారం. దీంతో గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు.
ఒక వేళ వార్డుల ఏర్పాటులో 13 మున్సిపాలిటీలకు సుమారు 26 నుంచి 30 వరకు మాత్రమే నూతనంగా వార్డులు ఏర్పడే అవకాశం ఉంటుందన్న అంచనా ఉంది. ఒక వార్డుకు ఒటర్ల సంఖ్యను 50 వేలకు వరకు నిర్ణయిస్తారా లేదా 30 వేల నుంచి 50 వేల లోపు ఓటర్లు వార్డుల్లో ఉండేలా చూస్తారా అన్న విషయమై సందిగ్ధం ఏర్పడింది. ఒక్కో వార్డుకు 25 వేల ఓటర్లు ఉండేలా చూస్తే వార్డులు పెరిగే అవకాశం ఉంటుందని అధికారుల ద్వారా సమాచారం అందుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో..
బీఆర్ఎస్ ప్రభుత్వం శివారు ప్రాంతాల అభివృద్ధికి ఆనాడు 13 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన తర్వాత అనేక నిధులు మంజూరు చేసి..అభివృద్ధి చేపట్టింది. శివారు ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి స్థిరపడిన వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. మున్సిపాలిటీలుగా మారి ఐదేండ్లు మాత్రమే పూర్తయిందని అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ఏమిటని శివారు ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేయడంపై మండిపడుతున్నారు. ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు జీహెచ్‌ంఎసీలో విలీనంపై అసహనానికి గురువుతున్నారు.