Diabetes | సుల్తాన్‌బజార్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో 12 శాతం మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి ప్రమాదకరంగా పెరుగుతోందని, ప్రజలు తక్షణమే అప్రమత్తమై పరీక్షలతో వ్యాధిని గుర్తించి ఆరోగ్యవంతమైన జీవనశైలిపై దృష్టి సారించాలని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారకనాథ్‌రెడ్డి, శాఖ కార్యదర్శి డాక్టర్ అశోక్ అన్నారు.
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ ఎవరికైనా షుగర్ వ్యాధి నిర్ధారణ అయితే అదేదో రుగ్మత అని భావించవద్దని సూచించారు. జీవనశైలిని మార్చుకోవాలని, ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఫైబర్, ఫ్రూట్స్, గ్రెయిన్స్, వెజిటేబుల్స్‌తో కూడిన ఆహారాలను తీసుకోవడం ఉత్తమమని చెప్పారు. ఇంటి వద్దే నిత్యం పరీక్షించుకునేలా గ్లూకో మీటర్లను సమకూర్చుకోవడం, వ్యాధిలో ఎలాంటి తీవ్రత ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు.