సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): నగరంలో వానలు మొదలవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గతం కంటే ఈసారి వారం పది రోజుల ముందే వర్షాలు కురవడంతో గ్రేటర్‌తో పాటు నగరంలో సాయంత్రం కాగానే దోమల దండయాత్ర మొదలవుతోంది. వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం పెరగడంతో వాతావరణం కొంత చల్లబడింది. దీంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో కూడిన సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. గడిచిన 20రోజుల్లో హైదరాబాద్ నగరంలోనే 12కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఈ కేసుల్లో అత్యధికంగా పాతబస్తీలోనే నమోదైనట్లు సమాచారం.
వర్షాకాలం ప్రారంభానికి ముందే జీహెచ్ఎంసీలోని ఎంటమాలజి విభాగం అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి చేయి దాటే వరకు వచ్చింది. దోమల కారణంగా డెంగీ, మలేరియా, చికున్‌గున్య వంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కరోనా అలజడి సమయంలో ఒకే లక్షణాలు కలిగిన డెంగీ కేసులు నమోదవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
దోమలు వృద్ధిచెందకుండా ఉండేందుకు యాంటీలార్వా, ఫాగింగ్ తదితర చర్యలు చేపట్టాలి. అంతే కాకుండా బస్తీలు, కాలనీలు, ముఖ్యంగా మురికి వాడల్లో కాలువలు, కుంటలు, నాలాల్లో దోమలు వృద్ధి చెందకుండా నివారణ చర్యలు చేపట్టాలి. కానీ సంబంధిత జీహెచ్ఎంసీ, ఎంటమాలజి విభాగం అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
వర్షాలు కురవడంతో దీని వల్ల దోమలు వృద్ధిచెంది సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశాలు లేకపోలేదని వాపోతున్నారు వైద్యులు. మూడురోజులైనా జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత వైద్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతే కాకుండా దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటితో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు.