వరుణుడి ప్రతాపానికి గ్రేటర్ చిగురుటాకులా వణికింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జన జీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో 12సెం.మీలు, కంటోన్మెంట్ పికెట్‌లో 11.50 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదవ్వడంతో పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్ల ప్రవేశంతో 2020 సంవత్సరం నాటి పరిస్థితులు కనిపించాయి. స్థానికంగా ఉన్న షోరూంలు, పరిశ్రమల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు. రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగగా…స్థానికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కుండపోత వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి..రహదారులపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో ఒక్క పక్క ట్రాఫిక్, మరో పక్క లోతట్టు ప్రాంతాల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని చోట్ల కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకువచ్చాయి. నాలాలు పొంగిపొర్లాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్‌శాఖ, పోలీస్, జలమండలి శాఖల సమన్వయం లోపంతో సహాయక చర్యలు ఆలస్యం కావడంతో సమస్యల వలయంలో చిక్కుకుని కంటి మీద కునుకు లేకుండా ప్రజలు గడిపారు.
– సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతో గత రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే గ్రేటర్ వ్యాప్తంగా కుండపోత వాన కురవడంతో నగరం అస్తవ్యస్తమైంది. స్కూళ్లు, కార్యాలయాలు ముగింపు సమయం కావడంతో పెద్ద సంఖ్యలో వాహనదారులు రోడ్లపైకి రావడం, అదే సమయంలో వాన దంచికొట్టడం వల్ల రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు వర్షం నీరు చేరడంతో విద్యార్థులను ఇండ్లకు తీసుకెళ్తున్న స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలు గంటల తరబడి ట్రాఫిక్ వలయంలో చిక్కుకుపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కార్యాలయాల నుంచి ఇండ్లకు చేరుకునే వారితో పాటు ఇతర వాహన దారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పలు చోట్ల వరద నీటిలో వాహనాలు మొరాయించడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ఉప్పర్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, అమీర్‌పేట, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, పికెట్, అల్వాల్, బొల్లారం, నాంపల్లి, అబిడ్స్, పాతబస్తీ, మలక్‌పేట, చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ నాలా పొంగిపోర్లడంతో పరిసరాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలతో పాటు పైగా కాలనీ పూర్తిగా నీట మునిగింది. దీంతో డీఆర్ఎఫ్ సిబ్బంది కాలనీలోని ప్రజలను ఇండ్ల నుంచి బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మాసబ్‌ట్యాంక్, హైటెక్‌సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్పల్లి, హఫీజ్‌పేట తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు ప్రవహించి, ఇండ్లలోకి చేరడంతో స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. మైత్రీవనం, నాచారం భవానీనగర్ ప్రాంతాల్లోని రహదారులు స్విమ్మింగ్‌పూల్‌ను తలపించాయి. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లు, పరిసర ప్రాంతాల్లో జలమయమయ్యాయి.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సీలింగ్ నుంచి గ్రౌండ్‌ఫ్లోర్‌కు వాన నీరు వచ్చి చేరింది. ఇటీవల కురిసిన వర్షానికి ఇన్వార్డ్ సెక్షన్లో వాన నీరు చేరి కంప్యూటర్లు పాడవగా, శుక్రవారం కురిసిన వానకు సీలింగ్ నుంచి వాన నీరు గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
శుక్రవారం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దాదాపు మూడు గంటలపాటు కురిసిన వర్షానికి నగరం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి 9గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సికింద్రాబాద్ పికెట్‌లో అత్యధికంగా 11.50 సెం.మీలు, బోయిన్‌పల్లిలో 12సెం.మీలు, నాచారంలో 10.0 సెం.మీలు, మూసారాంబాగ్‌లో 9.80సెం. మీల చొప్పున, సరూర్‌నగర్‌లోని మధురానగర్, వనస్థలిపురం, ఏఎస్.రావు నగర్, హ యత్‌నగర్ ప్రాంతాల్లో అత్యల్పంగా 1.0 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
సిటీ మొత్తంలో 270 ఫీడర్లలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. అమీర్‌పేట, మెహదీపట్నం, మలక్‌పేట, హబ్సిగూడ, రామ్ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లలో సాంకేతిక లోపం కారణంగా సరఫరా నిలిచింది .మరోవైపు బంజారాహిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో చెట్లకొమ్మలు పడిపోవడంతో సరఫరా పునరుద్ధరణకు కొంత సమయం పట్టిందని సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు.
ముషీరాబాద్: వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ డివిజన్ పద్మ కాలనీ నాలా పొంగి పక్కన ఉన్న ఇంటి ప్రహరీ కోతకు గురైంది. స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ భవనంలో నివాసముంటున్న 9 కుటుంబాలను ఖాళీ చేయించారు.
ఐటీ కారిడార్ మొత్తం ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుపోయింది. దాదాపు రెండు గంటలకు పైగా ఐటీ కారిడార్ రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మాదాపూర్, హైటెక్‌సిటీ, ఐకియా, ఏఎంబీ, ఇన్ఆర్బిట్మాల్, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్, లింగంపల్లి, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు.
నాదర్గుల్ ప్రాంతంలో గోడకూలి గుడిసె పై పడడంతో రమావత్ లక్ష్మి(35) అనే మహిళ చనిపోయింది. ఈదురు గాలులు లేకపోవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటుచేసుకోలేదు. కాగా అంబర్‌పేట, వైభవ్‌నగర్ కాలనీలో వరద ఉధృతికి స్థానికంగా ఉన్న ఒక కారు కొట్టుకుపోయింది.
రుతుపవనాల ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారి వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. భారీ వానలు కురిసే అవకాశాలుండటంతో గ్రేటర్‌కు వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.