సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన 1,190 సెల్ఫోన్లను సైబరాబాద్ పోలీసులు రికవరీ చేసి, సంబంధిత యజమానులకు అందచేశారు. ఈ మేరకు శుక్రవారం కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ కె.నర్సింహ వివరాలు వెల్లడించారు.
‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా చోరీకి గురైన సెల్ఫోన్లు రికవరీ చేస్తున్నట్లు.. గడిచిన 50 రోజుల్లో ఐదు జోన్ల పరిధిలో చోరీకి గురైన రూ.3.55 కోట్ల విలువైన 1,190 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
అందులో మాదాపూర్ సీసీఎస్ పోలీసులు 255, బాలానగర్ 250, మేడ్చల్ 208, రాజేంద్రనగర్ 157, శంషాబాద్ 140, బాలానగర్ లా అండ్ ఆర్డర్ జోన్ పోలీసులు 113, మేడ్చల్ లా అండ్ ఆర్డర్ జోన్ పోలీసులు 41, మాదాపూర్ జోన్ పోలీసులు 16, శంషాబాద్ జోన్ పోలీసులు 10 చొప్పున సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. రికవరీ చేసిన ఫోన్లను బాధిత యజమానులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్, లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.