సిటీబ్యూరో, మార్చి 20 ( నమస్తే తెలంగాణ): పదో తరగతి పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,76,789 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షల కోసం సంబంధిత విద్యాశాఖాధికారులు హైదరాబాద్లో 358 సెంటర్లు, మేడ్చల్లో 230 సెంటర్లు, రంగారెడ్డిలో 249 పరీక్షా సెంటర్లు ఏర్పాటు చేశారు. కాగా, గతంలో నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించే వారు కాదు. అయితే ఈ నిబంధనను ప్రభుత్వం కొంతమేర సడలించిన విషయం తెలిసిందే.
విద్యార్థులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ పరీక్ష రాసే విద్యార్థులకు గ్రేస్ పిరీయడ్ కల్పించింది. దీని ద్వారా పరీక్ష సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. అయితే విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేల ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత సెంటర్లకు చేరుకోవాల్సి ఉంటుందని, ఆలస్యంగా వెళితే టెన్షన్ పడాల్సి వస్తుందని చెప్పారు.
ప్రశాంతంగా పరీక్ష రాసేల ముందే చేరుకోవాలని సూచించారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు కొనసాగనున్నాయి. కాగా, హైదరాబాద్ జిల్లాలో 77,701 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, జిల్లాలో 358 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి డి. రోహిణీ తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 74,100 మంది ఉండగా.. ఒకసారి ఫెయిల్ అయి మళ్లీ పరీక్ష రాస్తున్నవారు 3,601 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఈ సారి రెగ్యులర్లో 38,003 మంది బాలికలు, 36,097 మంది బాలురు హైదరాబాద్లో పరీక్ష రాయనున్నారు. కాగా, పరీక్షలు ఈ నెల 21న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి.