ఎల్బీనగర్, సెప్టెంబర్ 12: వర్షాలు కురిస్తే చాలు పల్లపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయి. అసాధారణ వర్షం పడిందంటే చాలు ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం చిన్నాభిన్నం కావడం ఖాయం. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు, చెరువు శివారు కాలనీలు, వరద ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి గతంలో ఇదే స్థితి. అయితే వరద నీటి ముంపు నుంచి బాక్స్ డ్రెయిన్ల నిర్మాణంతో చెక్ పెడుతున్నారు. సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం కింద వరదనీటిని మల్లించి ముంపు నుంచి ఆయా ప్రాంతాలను గట్టెక్కిస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం కింద నాలాలను అభివృద్ధి చేసి వరదనీటి ముంపు లేకుండా చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. 2020లో కురిసిన అసాధారణ వర్షాలతో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలోని కాలనీలు అతలాకుతలం కాగా.. వరద నుంచి తెప్పరిల్లిన వెంటనే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పక్క ప్రణాళికలతో నాలాల లెవలింగ్ కోసం ఏజెన్సీల ద్వారా సమగ్ర సర్వే చేయించి బాక్స్ డ్రెయిన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా డెవలప్మెంట్ కార్యక్రమం కింద రూ.103.25కోట్లతో పనులు చేపట్టారు. మొత్తం 8 ప్రాంతాల్లో బాక్స్ డ్రెయిన్, నాలా పనులు ఇప్పటికే 80 శాతం పూర్తి చేశారు.

మరో 20 శాతం పనులు పూర్తయితే వరద నీటి ముంపునకు శాశ్వత పరిష్కారం కలిగినట్టే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈపనులు చేపట్టడంతో భారీ వర్షాలు కురిసినా చాలా ప్రాంతాలు వరద ముంపు సమస్య నుంచి గట్టెక్కాయి. బండ్లగూడ చెరువు నుంచి నాగోలు చెరువు వరకు, బండ్లగూడ చెరువు నుంచి మూసీ నది వరకు నిర్మించిన బాక్స్ డ్రెయిన్ పనులు పూర్తి కావడంతో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో వరద ముంపుతో ప్రజలు అష్టకష్టాలు పడారు. ఈ పనులతో కొంత ఉపశమనం లభించిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వంగ శంకరమ్మ గార్డెన్స్, వంగ అనంతరెడ్డి గార్డెన్స్ వద్ద రోడ్డు కటింగ్ పనులు చేపడుతున్నారు. దాదాపుగా మరో 20 శాతం పనులను ఈ డిసెంబర్ మాసంలోగా పూర్తి చేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనులు చేపడుతున్నారు. పనులన్నీ పూర్తయితే వరద ముంపు నుంచి అన్ని ప్రాంతాలను సురక్షితంగా బయటపడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. సరూర్‌నగర్ చెరువు దిగువ ప్రాంతంలో గతంలో వర్షాలు పడ్డాయంటే చాలు ప్రజలు బయాందోళనలు పడే పరిస్థితి ఉండేది. తాజాగా సరూర్‌నగర్ చెరువుకు గేట్లను అమర్చడంతో పాటు వరదనీటి కాలువ పనులు చేపట్టడం, చైతన్యపురి బ్రిడ్జి వద్ద ఇరువైపులా వరదనీరు వెళ్లేలా ఏర్పాట్లు చేయడంతో ఇక్కడ వరద ముంపు సమస్యలు 80 శాతం వరకు తీరిపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే తమ ప్రాంతాలకు వరద భయం పోతుందని పేర్కొంటున్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో 2020లో వచ్చిన వరదలతో చాలా ప్రాంతాలు ముంపునకు గురవడంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. ముంపు సమస్య పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చారు. అవసరమైన చోట నాలాలు, బాక్స్ డ్రెయిన్లు నిర్మించడానికి ఏజెన్సీతో కలిసి ఒక రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అన్ని ప్రాంతాల్లో తిరిగి లెవల్స్‌ను సేకరించి సమగ్రంగా ప్రణాళికలను సిద్ధం చేశాం. అందులో భాగంగా రూ.103.25కోట్లతో బాక్స్ డ్రెయిన్ పనులకు శ్రీకారం చుట్టాం. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తికాగా, మరికొన్ని ప్రాంతాల్లో 80 శాతం పూర్తయ్యింది. పనులన్నీ పూర్తయితే ఎల్బీనగర్ నియోజకవర్గం వరద ముంపు నుంచి శాశ్వతంగా గట్టెక్కుతుంది. సరూర్‌నగర్ చెరువు ప్రాంతంలో తూముల వద్ద గేట్లను అమర్చి వరదనీటికి కంట్రోలింగ్ చేయడంతో పాటు టన్నెలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.
– దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఎల్బీనగర్
దశాబ్దాలుగా ఉన్న వరద నీటి ముంపు సమస్య నుంచి శాశ్వతంగా గట్టెక్కుతున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పట్టుదలతో చేపడుతున్న సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం ముంపు ప్రాంతాల ప్రజలకు వరంలా మారింది. సరూర్‌నగర్ చెరువు తూముల వద్ద గేట్లు అమర్చడం, జాలీలు ఏర్పాటు చేయడం, వరదనీరు ఇండ్లను ముంచెత్తకుండా చేపట్టిన నాలాలు, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణంతో మా ప్రాంతంలోని ప్రజలు కాస్తా సురక్షితంగా ఉన్నారు. ప్రతియేటా వర్షాకాలం వచ్చిందంటే చాలు భయపడుతూ బతికేవాళ్లం. ఈ ఏడాది భారీ వర్షాలు పడినా నాలాల వ్యవస్థలో ఉపశమనం కలిగింది. బాక్స్ డ్రెయిన్లు 100 శాతం పూర్తయితే ముంపు కష్టాలు తీరినట్లే.
– భవాని ప్రవీణ్‌కుమార్, మాజీ కార్పొరేటర్, గడ్డిఅన్నారం