Jalamandali | బంజారాహిల్స్: ఇష్టారాజ్యాంగా నీటిని వృథా చేసేవారిని, మంచినీటితో వాహనాలను కడిగే వారిని గుర్తించి భారీగా జరిమానాలు విధించాలని జలమండలి అధికారులను మేయర్ ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్. 12 లోని ఎమ్మెల్యే కాలనీ వాసుల సమావేశంలో మేయర్ పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. భూగర్భ జలాలు అడుగంటడంతో నగర వ్యాప్తంగా చాలా ప్రాంతంలో జలమండలి నీటిపైనే ఆధారపడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కొందరు అవసరం ఉన్నా.. లేకపోయినా చీటికిమాటికీ వాహనాలు కడుగుతూ, పైపుల ద్వారా ఇంటి ముందు నీళ్లను వృథా చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై జలమండలి అధికారులు కఠినంగా ఉండాల్సిందేనని, వారిని గుర్తించి రూ. 10 వేల జరిమానా కూడా విధించాలని ఆదేశించారు.