Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు ఎట్టకేలకు కార్యరూపంలోకి రానున్నాయి. నగర వ్యాప్తంగా 39 ఎస్టీపీలను రూ. 3800 కోట్లతో నిర్మించనున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ ప్రోగ్రాం కింద నిధులు కేటాయించేందుకు ఇప్పటికే అనుమతి పొందగా, తాజాగా రాష్ట్ర పురపాలక శాఖ కూడా పాలనపరమైన అనుమతులు ఇచ్చింది. దీంతో నగరంలో ఎస్టీపీల నిర్మాణ పనులు వేగంగా జరగనున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో రూ. 3,866 కోట్ల వ్యయంతో 31 ఎస్టీపీల నిర్మాణాన్ని చేపట్టి ఇందులో ఏడింటిని వినియోగంలోకి తీసుకొచ్చింది.
కాంగ్రెస్ సర్కారు ఇటీవల రెండింటిని ప్రారంభించి, మరో రెండు ఎస్టీపీలకు ట్రయల్ రన్ నిర్వహించింది. మిగిలిన ప్రాంతాల్లో పలు దశల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ 31 ఎస్టీపీల ద్వారా 1260 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసుకునే వీలు ఉంది. దీనికి అదనంగా 965 ఎంఎల్డీల మురుగునీటిని శుద్ధి చేసేలా మరో 39 ఎస్టీపీలకు గతంలోనే కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ అమృత్ పథకం కింద ఆమోదం తెలిపింది. హెచ్ఏఎం విధానంలో చేపట్టబోయే ఈ ఎస్టీపీలకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా శనివారం పాలనపరమైన అనుమతులు జారీ చేసింది.
అమృత్ 2.0 ద్వారా 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు రూ. 3849 కోట్ల నిధులు కేటాయించారు. ఓఆర్ఆర్, జీహెచ్ఎంసీ, మూసీ నది ప్రక్షాళనతోపాటు శివారుల్లో ఉన్న పురపాలక సంస్థల కోసం వీటిని నిర్మించనున్నారు. మొత్తం 39 ఎస్టీపీల నిర్మాణానికి కేంద్రం 30, రాష్ట్ర ప్రభుత్వం 30, పీపీపీ విధానంలో 40శాతం చొప్పున నిధులను వెచ్చించనున్నారు. రెండు ప్యాకేజీల్లో ఈ ఎస్టీపీలను నిర్మించేందుకు చర్యలు చేపట్టగా… 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేసుకునే వీలుంటుందని అధికారులు పేర్కొన్నారు.
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో మురుగు నీటి నిర్వహణ అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలోనే నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా తొలుత రాష్ట్ర ప్రభుత్వమే 31 ఎస్టీపీల నిర్మాణాలను మొదలుపెట్టింది. వీటికి అదనంగా కేంద్ర సర్కారు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా సద్వినియోగం చేసుకుని, ఓఆర్ఆర్, మూసీ, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ మురుగు నీటిని శుద్ధి చేసే విధంగా ఎస్టీపీలకు ప్రణాళికలు రూపొందించింది. అమృత్ పథకం కింద అనుమతులు పొందింది. ఇలా వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేసుకునే స్థాయికి నగరం చేరుకోవడంలో గత సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఉంది.