సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఒడిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతన్న ఏడుగురి ముఠాను రంగారెడ్డి డివిజన్ ఎన్ఫోర్స్మెంట్ పొలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.7కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్‌కిరణ్ కథనం ప్రకారం ఖమ్మంకు శ్రీగిరి సురేష్, షేక్ సోయల్, పొడిల జస్వంత్, పొడిల యశ్వంత్, మల్లంపర్తి సాయిప్రవీణ్ నగరానికి చెందిన అందె శ్రీనాథ్, అందె సన్సేన్తో కలిసి ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
ఖమ్మంకు చెందిన ఐదుగురు ఒడిస్సా నుంచి గంజాయిని నగరానికి తీసుకు వచ్చి, అందరూ కలిసి విక్రయిస్తారు. వచ్చిన లాభాలను సమానంగా పంచుకుంటారు. సమాచారం అందుకున్న రంగారెడ్డి ఎన్‌ఫొర్స్‌మెంట్ పోలీసులు నిందితుల ఇంటిపై దాడి చేశారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఏడుమంది నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 3.7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జనగామకు చెందిన బి.నిఖిల్(20) ఫోటోగ్రాఫర్. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అఖిల్ డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎన్ఫోర్స్మెంట్ సీఐ బాలరాజు, ఎస్ఐ రవి తమ సిబ్బంది కలిసి ఘట్కేసర్లోని యెన్నంపేట్ ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేసి, 1.4కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బాలనగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎన్‌ఫొర్స్‌మెంట్ పోలీసులు రూట్‌వాచ్ నిర్వహించారు. ఈ తనిఖల్లో స్కూటీపై తిరుగుతూ గంజాయి విక్రయిస్తున్న మహ్మద్ జమీల్‌ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 1.250కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా కవిత అనే మహిళపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ధూల్‌పేట్ దేవినగర్‌లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న మనోజ్సింగ్ను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 1.568కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలకు సహకరిస్తున్న అరుణబాయి, సుమ బాయిలపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఎస్టిఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి తెలిపారు.