Drugs | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రతి రోజు నగరం నలుమూలల ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎఫిడ్రిన్ అనే డ్రగ్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పరిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో సాయిదత్తా రెసిడెన్సీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఈగల్ టీమ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఈగల్ టీమ్ అక్కడ దాడులు నిర్వహించి.. 220 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. పట్టుబడ్డ డ్రగ్ విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అదే అంతర్జాతీయ మార్కెట్లో అయితే రూ. 70 కోట్లు విలువ చేస్తుందన్నారు.
ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి నలుగురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో వాస్తవాయి శివరామకృష్ణ వర్మ, దంగేటి అనిల్, మద్దు వెంకటకృష్ణ, ఎం ప్రసాద్, ముసిని దొరబాబు ఉన్నారు. వీరంతా ఏపీలోని కాకినాడ, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాలకు చెందిన వారని పోలీసులు తేల్చారు.