కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 30 : కేపీహెచ్‌బీ కాలనీలోని హౌసింగ్‌బోర్డు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దులో.. వేర్వేరు గ్రామాలకు చెందిన భూమిపై కన్నేసి.. ఓ గ్రామంలోని సర్వే నంబర్‌తో మరో గ్రామ పరిధిలోని విలువైన స్థలాన్ని కాజేసేందుకు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారు. రెవెన్యూ, హౌసింగ్‌బోర్డు విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది లోపాయికారి సహకారంతో సుమారు రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని కాజేయాలని యత్నించారు.
ఇన్నాళ్లు హౌసింగ్‌బోర్డుకు చెందిన స్థలంగా భావించిన స్థలంలోనే ఇటీవల ప్రైవేట్ వ్యక్తులు బోర్డులు పాతి.. డబ్బాలను ఏర్పాటు చేయడంతో హౌసింగ్‌బోర్డు స్థలం అన్యాక్రాంతమవుతున్నదని గుర్తించారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెవెన్యూ, హౌసింగ్‌బోర్డు, జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగాల అధికారులతో శుక్రవారం క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు, రైల్వే పట్టాల మధ్యలో ఉన్న విలువైన స్థలాన్ని తప్పుడు పత్రాలు, అధికారుల అండతో హస్తగతం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని.. అధికారులు కబ్జాదారులకు సహకరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.
రెండు జిల్లాల సరిహద్దులను తేల్చాలని సర్వే నం.78, 1009ల స్థలాలను సర్వేచేసి నివేదికను సిద్ధం చేయాలని కోరారు. జిల్లాలు, గ్రామాల హద్దులను గుర్తించి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేయకుండా చూడాలన్నారు. రెండు సర్వే నంబర్ల విషయం తేల్చేవరకు ఈ స్థలాలలో ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని ఆదేశించారు. ఈ రోడ్డును 200 ఫీట్ల రోడ్డుగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆ స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడంతో పాటు హౌసింగ్‌బోర్డు స్థలంగా పేర్కొంటూ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే స్పందించిన హౌసింగ్‌బోర్డు అధికారులు హౌసింగ్‌బోర్డు స్థలంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ వ్యక్తుల బోర్డును తొలగించి హౌసింగ్‌బోర్డు బోర్డును పాతారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మల్లయ్య, తాసీల్దార్ గోవర్దన్, హౌసింగ్‌బోర్డు ఈఈ కిరణ్‌కుమార్, జీహెచ్ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ అధికారులు ఉన్నారు.