సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ): దుండిగల్ లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గదిలో 30కి పైగా విద్యుత్ మీటర్లు బయటపడ్డాయి. ద్యుత్ శాఖ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మీటర్ల జారీ వెనక క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పదిలక్షలకు పైగా వసూలు చేస్తే ఆ సమయంలో ఇక్కడ ఉన్నతాధికారిగా పనిచేసిన వారికి అందులో పెద్దమొత్తంలోనే డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని లైన్మెన్లు, ఆర్టిజన్లు కలిపి చేశారని దానికి అప్పటి ఉన్నతాధికారి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ శివారు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి అధికారులు చేస్తున్న దందా అంతాఇంతా కాదు. జీడిమెట్ల, కీసర, కూకట్పల్లి, మేడ్చల్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది ఎక్కువ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతీపనిలో ముడుపులు ముట్టందే పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వినియోగదారుల నుంచి డబ్బుల వసూలు చేయడం, తమ పర్సంటేజ్ తీసుకుని పై అధికారులకు పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, ఆర్టిజన్లకు నిత్యకృత్యమైంది. కొత్తలైన్లు, లైన్ షిఫ్టింగ్, మీటర్లు, ప్యానల్బోర్డులు ఇలా ప్రతీ పనికో రేటు చొప్పున ఫిక్స్ చేస్తున్నారు. చాలామంది క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
సిబ్బందిపై అవినీతి ఫిర్యాదులొస్తున్నా ఉన్నతాధికారులు వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
ఎస్టిమేషన్లు లేకుండా ప్యానల్బోర్డులు, విద్యుత్ మీటర్లు ఇస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని దక్షిణ డిస్కం ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ఫిర్యాదు నంబర్లకు మొదట్లో రోజుకు పది వరకు ఫిర్యాదులు రాగా, ఇప్పటివరకు దాదాపు 400కు పైగా ఫిర్యాదులొచ్చినట్లు సమాచారం. గతంలో వచ్చిన 30 ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నామని అధికారులు చెబుతున్నా..ఇదంతా సాగతీత ధోరణిలా ఉందంటూ వినియోగదారులు చెబుతున్నారు.