మేడ్చల్, ఏప్రిల్ 4 : మాయ మాటలు చెపుతూ ప్రజల్ని మోసం చేస్తున్న బీజేపీని తరిమికొట్టాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ పట్టణంలో మంగళవారం బీఆర్ఎస్ మున్సిపాలిటీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశం మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తుందన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలపడుతుందని, అక్కడ పెట్టిన సభలకు పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు తరలివచ్చి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం, దేశంలో బీఆర్ఎస్ విజయఢంకా బజాయిస్తుందని అన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేసే ప్రతి పథకం ఒక చరిత్రే అని అన్నారు. మరో 1000 మందికి దళితబంధు అందజేస్తామని తెలిపారు. 60 నుంచి 120 గజాల లోపు స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. జీహెచ్ఎంసీకి సంబంధించి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వం 40 వేల ఇండ్లను నిర్మించిందని, అందులో 10 శాతం అంటే 4 వేల ఇండ్లు నియోజకవర్గ ప్రజలకు దక్కనున్నాయని తెలిపారు.
9 ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసింది. వాటి ఫలితాలను అనుభవించాలంటే బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలి. బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులు కావాలి.
– సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కేసీఆర్ తెలంగాణ సాధించారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
– మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జి