తెలుగు భాషకు వాకిలి తెలంగాణ. ప్రబంధ కాలంలోనూ ఈ నేలలో సాహితీసాగు అద్భుతంగా సాగింది. ఆనాటి కవులు వెలయించిన వెల కట్టలేని పద్య కుసుమాలను, అందులోని శబ్ద, ఆలంకారిక, భావ విశేషాలను పరిచయం చేసే ప్రబంధ పరిమళం ఇక వారం వారం మీ కోసం..
సీ॥ సలలితేంద్రియ గోపికలు వర ప్రీతిచే
జనుదెంచి తనుబొంది సంతసింప
బ్రహ్మదండి లతావిభా స్వదాథారాదిక
పికావళి మహా వికాసమొంద
బ్రస్ఫుటీకృత పటుస్ఫట
గుండలీంద్రుడ త్యానందకరముగా నాడుచుండ
బొందుగా భ్రూమధ్య బృందావనమ్మున
బ్రత్యక్షబోధ గోపాలమూర్తి
తే॥ విమల మానస పవనహస్తముల చేత
దన సుషుమ్నా మురళి లీల దాల్చి మధుర
గాన మొనరించెననగ నోంకార మలఘు
వేణునాద స్వరూపమై వెలయునంత
వరంగల్ పట్టణం మట్టెవాడకు చెందిన శ్రీ పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తి రచించిన శ్రీసీతారామాంజనేయ సంవాదం అనే కావ్యంలోని ప్రథమాశ్వాసంలోని పద్యం ఇది. దాదాపు 1760వ ప్రాంతంలో రాసిన ఈ కావ్యం అత్యంత ప్రౌఢం, నిగూఢం, మిగుల తాత్వికం. శ్రీరామచంద్రుని తారక బ్రహ్మగా నిరూపిస్తూ సీతమ్మ హనుమంతునికి బ్రహ్మతత్వం ఉపదేశించే సందర్భ క్రమంలో వస్తుంది.
ప్రణవనాదం పది రూపాలను వేరు వేరు పద్యాలలో వర్ణిస్తూ ఏడోదైన వేణు నాదాన్ని వివరిస్తున్న పద్యం ఇది. చిణీ, చిణిచిణీ, ఘంటా, శంఖా, వీణా, తాళ, వేణు, భేరీ, మృదంగ, మేఘ అనే పది తెఱగుల ప్రణవనాదం విరాజిల్లుతున్నది. ఓంకారానికి ఉన్న అకార, ఉకార, మ కారాలను అంగాలలో ఈ దశవిధ నాదాలే అకారానికి అర్థం. ఉకారం అంటే బిందువు. మకారం అంటే చిత్కళ. అందుకే ఓంకారాన్ని నాదబిందుచిత్కళ అంటారు.
మిగుల మనోహరాలైన ఇంద్రియాలనే గోపికలు వరప్రీతితో విచ్చేయగా (వరప్రీతి= పతిగా భావించే కృష్ణునిపై ప్రేమతో గోపికలకు; పరప్రీతి అని అన్వయించిన ఇంద్రియాలకు నాయకుడైన పరబ్రహ్మగా)
తన సాన్నిధ్యం వారికి పరమానందం కల్గించగా బ్రహ్మదండి అనే వృక్షం (వెన్నెముక)ను ఆశ్రయించిన మూలాధారం నుంచి గల షట్చక్రాలు కోకిలలుగా (పికావళి) మహా వికాసం పొందేటట్లుగా, విచ్చిన పడగతో నాట్యం చేస్తుండగా కుండలీంద్రుడు (కుండలినీ అనే శక్తి రూపం) జ్ఞాన రూపుడైన శ్రీకృష్ణుడు భూమధ్యభాగం అనే బృందావనం చేరి నిర్మలమైన మనసు, ప్రాణం (పవన) అనే రెండు చేతులతో సుషుమ్నా నాడి అనే వేణువును పట్టుకుని గానం చేస్తున్నాడా? అన్నట్లుగా ప్రణవనాదం వేణు నాదరూపంతో ప్రకాశించింది. ఈ పరిపూర్ణ తాత్విక భావంతో పద్యం పరిమళించింది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ