ధర్మశాల : ఐపీఎల్ 19 సీజన్ ఆఖరిఘట్టానికి చేరుకుంది. సుదీర్ఘ పోరాటాల లీగ్ దశ తర్వాత అసలు సిసలైన సమరానికి హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన ధర్మశాల క్రికెట్ స్టేడియం వేదికైంది. మంగళవారం జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ చాంప్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకోనుంది. దాంతో ఇరు జట్లు సర్వశక్తులూ ఒడ్డడానికి సిద్ధమయ్యాయి. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉన్నప్పటికీ, ఫైనల్ బెర్త్‌ను ఇప్పుడే ఖరారు చేసుకోవాలని రెండుటీమ్స్ భావిస్తున్నాయి. లీగ్ దశలో ఆర్సీబీ, జీటీ 14 మ్యాచ్‌ల్లో తలో 9 విజయాలు, 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ (+0.783) కారణంగా ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, టైటాన్స్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సీజన్లో అత్యంత సమతూకంతో కూడిన రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఈ పోరు జరగనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సీజన్ ద్వితీయార్థంలో అత్యంత ప్రమాదకరమైన జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్ తమ బౌలింగ్ బలంతో ఆకట్టుకుంటోంది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ రన్నరప్ చెన్నైని 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి ప్లేఆఫ్స్ పోరుకు అర్హత సాధించింది.కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్థిరమైన ప్రదర్శనతో జట్టుకు బలమైన పునాది వేస్తున్నాడు. అతనితో పాటు యువ సంచలనం సాయి సుదర్శన్, అనుభవజ్ఞుడైన జోస్ బట్లర్ లీగ్ దశలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ జట్టు ఎక్కువగా ఈ ముగ్గురిపైనే ఆధారపడుతుండటంతో వీరి ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. టైటాన్స్ విజయాల్లో సిరాజ్, రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ త్రయం ప్రధాన పాత్ర పోషించింది. గతంలో ఆర్సీబీ తరఫున ఆడిన అనుభవమున్న సిరాజ్.. ఆ జట్టు బ్యాటర్ల బలహీనతలను దెబ్బకొట్టే వ్యూహం తో ఉన్నాడు. దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ రబాడ ధర్మశాల పిచ్‌పై లభించే అదనపు బౌన్స్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో అఫ్గాన్ స్టార్ రషీద్ ఖాన్, ఎడమచేతి వాటం స్పిన్నర్ సాయి కిషోర్ పరుగులను కట్టడి చేయడమే కాకుండా కీలక వికెట్లు పడగొడుతున్నారు. బెంగళూరు మిడిల్ ఆర్డర్లో రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రషీద్ బౌలింగ్ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది.
వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉన్న ఆర్సీబీ ఈ సీజన్లో మునుపటి కంటే భిన్నమైన వ్యూహాలతో రాణించింది. కేవలం బ్యాటింగ్‌పైనే ఆధారపడే జట్టు అనే ముద్రను చెరిపేస్తూ.. ఈసారి బౌలింగ్‌లోనూ అద్భుత నిలకడను ప్రదర్శించింది. డుప్లెసిస్ తర్వాత జట్టు పగ్గాలు చేపట్టిన యువ సారథి రజత్ పాటిదార్ బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ జట్టును ముందుండి నడిపించాడు. మైదానంలో అతని ప్రశాంతత, బౌలింగ్ మార్పులు ఆర్సీబీ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణమయ్యాయి. ఇక, లీగ్ దశలో జట్టు విజయాల్లో విరాట్ కోహ్లీ అత్యంత కీలక పాత్ర పోషించాడు. తన ఫామ్ జట్టుకు కీలకం కానుంది. ఇక, చేతి వేలి గాయం నుంచి కోలుకున్న ఫిల్ సాల్ట్ తిరిగి జట్టులో చేరడం సానుకూలాంశం. కోహ్లీ, సాల్ట్ జోడీ పవర్‌ప్లేలో గుజరాత్ బౌలర్లను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. సాల్ట్ గైర్హాజరీలో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడం జట్టుకు కలిసొచ్చే అంశం. రజత్తో పాటు లోయర్ ఆర్డర్లో కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ రూపంలో బలమైన హిట్టర్లు ఉంటడంతో ఆర్సీబీ బ్యాటింగ్ అత్యంత పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ ఆ జట్టుకు తిరుగులేదు. ఆస్ట్రేలియా పేస్ గన్ జోష్ హేజిల్‌వుడ్, భారత స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ధర్మశాల లాంటి పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌పై వీరిద్దరూ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మరో పేసర్ రసిఖ్ సలామ్, స్పిన్నర్లు, కృనాల్, సుయాశ్ వీళ్లకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు.