పారిస్ : ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పెను సంచలనం. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బరిలోకి దిగిన దిగిన తెలుగు సంతతి కుర్రాడు, అమెరికా ప్లేయర్ బసవారెడ్డి నిశేష్.. తొలి మ్యాచ్‌లోనే ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి టెన్నిస్ సర్క్యూట్లో ప్రకంపణలు రేపాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులోనిశేష్ 7-6(7/5), 7-6(7/5), 6-7(9/11), 6-1తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ఫ్రిట్జ్‌పై అద్భుత విజయం సాధించి ఔరా అనిపించాడు. 2 గంటల 45 నిమిషాల పాటు సాగిన పోరులో21 ఏండ్ల నిశేష్.. తన దేశానికే చెందిన ఫ్రిట్జ్కు దీటైన పోటీనిచ్చాడు. నెట్ దగ్గర అద్భుతమైన డ్రాప్ షాట్లతో పాటు పవర్ఫుల్ బ్యాక్ హ్యాండ్ డౌన్ ద లైన్ షాట్లతో ఫ్రిట్జ్‌ను పదే పదే ఇరకాటంలో పడేశాడు. ఈ మ్యాచ్‌లో ఫ్రిట్జ్ 71 విన్నర్లతో విరుచుకుపడినప్పటికీ, నిశేష్ అంతే దీటుగా స్పందించి 51 విన్నర్లు కొట్టడమే కాకుండా అద్భుతమైన డిఫెన్స్‌తో నిలబడ్డాడు.
రోలాండ్ గారోస్‌లో జాన్ గాంబిల్ (2000లో) తర్వాత టాప్-10 ప్లేయర్‌ను ఓడించిన అమెరికన్‌గా నిశేష్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. రెండో రౌండ్లోఅతను మరో అమెరికన్ అలెక్స్ మిచెల్సన్తో తలపడుతాడు. మిగతా మ్యాచ్‌ల్లో సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ 5-7, 7-5, 6-1, 6-4తో పెత్సి పెరికార్డ్(ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 8వ సీడ్ అలెక్స్ డి మినార్ 6-4, 6-4, 6-2తో శామ్యూల్‌పై, 24వ సీడ్ టామి పాల్ 4-6, 6-3, 7-5, 6-4తో హిజికాటాపై, 19వ సీడ్ ఫ్రాన్సెస్ తియాఫో 6-3, 6-7, 6-4, 6-3తో స్పిజ్జిరిపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కజకిస్తాన్ స్టార్ ఎలెనా రిబాకినా 6-2, 6-2తోఎర్జావెక్పై గెలిచి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మూడో సీడ్ స్వియాటెక్ 6-1, 6-2తో జోన్స్‌పై, ఏడో సీడ్స్వితోలినా 3-6, 6-1, 7-6(10-3) బొండర్పై నెగ్గారు. ఆరో సీడ్ అనిసిమోవా 6-3, 6-1తో రాజావ్ను ఓడించగా, 13వ సీడ్ జాస్మిన్ పౌలిని 7-5, 6-3తో డయానా యామ్స్కాపై గెలిచింది.
నిశేష్ పుట్టింది, పెరిగింది అమెరికాలోనే అయినా అతని తల్లిదండ్రులు సాయి ప్రసన్న, మురళీకృష్ణది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు. 1999లో కుటుంబంతో అమెరికాకు వలస వెళ్లిన మురళీకృష్ణ తన ఇద్దరు కుమారులైన నిశేష్, నిశాంత్‌ను చిన్నతనం నుంచే టెన్నిస్ వైపు ప్రోత్సహించారు. జూనియర్ టెన్నిస్‌లో తిరుగులేని ప్రదర్శన చేసిన నిశేష్.. ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ 3 స్థానానికి చేరుకున్నాడు. 2022 జూనియర్ యూఎస్ ఓపెన్ బాలుర డబుల్స్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. 2016, 2018లో మోకాలి రెండు శస్త్ర చికిత్సలు ఇబ్బంది పెట్టినా అస్సలు వెనక్కుతగ్గలేదు. 2024 చివర్లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారిన బసవారెడ్డి అదే ఏడాది ప్యూర్టో వల్లార్టా, టిబురాన్లో రెండు ఏటీపీ చాలెంజర్ టైటిళ్లను గెలుచుకుని, ఏటీపీ నెక్స్స్ట్ జెన్ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు.
బసవారెడ్డి నిశేష్ గ్రాండ్‌స్లామ్ ఆడటం ఇదే తొలిసారి కాదు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా మెయిన్ డ్రాలో అడుగుపెట్టి గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేశాడు. ఆ టోర్నీ తొలి రౌండ్లోనే లెజెండరీ ప్లేయర్ జొకోవిచ్‌తో తలపడిన అతను ఫస్ట్ సెట్‌ను (6-4) గెలుచుకుని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. తర్వాతి మూడు సెట్లు కోల్పోయి మ్యాచ్ ఓడినప్పటికీ జొకోవిచ్ నుంచే ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 2025 జూన్‌లో ఏటీపీ టాప్-100 ర్యాంకింగ్స్‌లోకి దూసుకొచ్చి వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లోనూ ఆడాడు. ప్రస్తుతం ప్రపంచ 148వ ర్యాంకులో ఉన్న నిశేష్.. యూఎస్‌టీఏ రోలాండ్ గారోస్ వైల్డ్ కార్డ్ చాలెంజ్ గెలవడం ద్వారా ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రా బెర్త్‌ను సంపాదించుకున్నాడు. తొలి రౌండ్లోనే ఫ్రిట్జ్‌ను మట్టికరిపించిన ఈ కుర్రాడు టెన్నిస్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.