సిటీబ్యూరో, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే లోడ్‌ను బట్టి వాటికి విద్యుత్ తనిఖీ అధికారుల ధ్రువీకరణ కావాలి. ఇటీవల కొన్ని నెలల పాటు తనిఖీ అధికారులు లేకపోవడంతో పాత అధికారుల సంతకాలతో కొందరు వ్యక్తులు అప్రూవల్స్ తయారు చేసి కనెక్షన్లు తీసుకున్నట్లు సీఈఐజీ కార్యాలయంలో చర్చ జరుగుతున్నది. విద్యుత్ తనిఖీ విభాగం అధికారుల పేరుతో ఫోర్జరీ డిజిటల్ సంతకాల వ్యవహారం ఎస్పీడీసీల్, సీఈఐజీ విభాగాల్లో సంచలనమైంది. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్(సీఈఐజి) విభాగంలో విద్యుత్ కేబుళ్లు, పరికరాల నాణ్యతను పరిశీలించి, వాటికి అనుమతులిచ్చేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
పరిశ్రమలతో పాటు 15 మీటర్లు ఎత్తుదాటిన ప్రతి వాణిజ్య, గృహ సముదాయానికి 75 కిలోవాట్స్ కన్నా అధిక లోడ్‌తో విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటే విద్యుత్ తనిఖీ అధికారి నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా తీసుకోవాలి. టీఎస్‌ఐపాస్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి కావాల్సిన నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. భవిష్యత్ విద్యుత్ అవసరాలు, ఎంపిక చేసిన విద్యుత్ సామర్థ్యం, ఇన్కమింగ్ లైన్, అంతర్గత విద్యుత్ లైన్లు, కేబుల్స్, ఏబీ స్విచ్‌లు, ఎర్తింగ్ సిస్టమ్ సహా డీటీఆర్ వంటివి పక్కాగా ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే ఆ భవనాలకు ఎన్ఓసీ వస్తున్నది.
ఇదంతా సీఈఐజీ కార్యాలయం నుంచి జరగాల్సలిన పని. అయితే అసలు సీఈఐజీ కార్యాలయానికి తెలియకుండానే వందల కొద్దీ అప్రూవల్స్ బయటకు వచ్చాయి. ఈ వ్యవహారమేదీ ఆ కార్యాలయానికి తెలియకుండా, అధికారి దృష్టిలో లేకుండా కొన్ని సందర్భాల్లో అధికారే లేకుండా వారి సంతకాలతో జరుగుతున్నది. ఇందుకు సంబంధించి దక్షిణ డిస్కం పరిధి గ్రేటర్‌లోని పది సర్కిళ్లలో పెద్దఎత్తున నకిలీ డ్రాయింగ్ అప్రూవల్స్ ఫోర్జరీ సంతకాలతో ఇచ్చారని సీఈఐజీ కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. అసలు ఈ వ్యవహారం తమ కార్యాలయానికి తెలియకుండానే ఎలా జరిగిందనే దిశగా ఉన్నతాధికారులు ఆరా తీస్తే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగుచూశాయి.
సీఈఐజీ అనుమతుల కోసం అపార్ట్మెంట్లు, భవనాలు, పరిశ్రమలు, టీఎస్ ఐపాస్‌లో డ్రాయింగ్ అప్రూవల్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వారు అప్రూవల్స్ ఇచ్చిన తర్వాతే విద్యుత్ అధికారులు కనెక్షన్లు ఇవ్వాలి. సీఈఐజీ అధికారులు ధ్రువీకరించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనే నిబంధన కూడా ఉన్నది. ఈ విషయంలో సీఈఐజీ ఆఫీసులో వందల కొద్దీ ఫైల్స్ అప్రూవల్స్ కోసం పెండింగ్‌లో ఉండటంతో నకిలీలు పుట్టుకొచ్చాయి. కొందరు కాంట్రాక్టర్లు, విద్యుత్ అధికారులు, సీఈఐజీ సిబ్బందితో కలిసి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి వినియోగదారులకు అడ్డదారుల్లో కనెక్షన్లు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. సీఈఐజీ, డిప్యూటీ సీఈఐజీ అధికారులు ఉన్నా లేకున్నా వారి డిజిటల్ సంతకాలతో భవనాలకు అనుమతులు వచ్చాయి.
మూడు నెలలపాటు సీఈఐజీ లేని సమయంలో సుమారుగా వందకు పైగా హైరైజ్డ్ భవనాలకు అనుమతులు వచ్చాయని తెలుస్తున్నది. డిప్యూటీ సీఈఐజీ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందే సమయం కంటే ముందు కూడా ఆయన డిజిటల్ సంతకంతో అప్రూవల్స్ వచ్చినట్లు సీఈఐజీ కార్యాలయానికి కొన్ని ఫిర్యాదులొచ్చాయి. విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయం నుంచి వచ్చిన అప్రూవల్స్‌లో ఉన్న డిజిటల్ సంతకాలు ఫోర్జరీ చేసినవని దక్షిణ డిస్కం పరిధిలోని సర్కిళ్ల అధికారులకు తెలిసినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. రెండు శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నకిలీ సర్టిఫికెట్లు పెద్దఎత్తున వచ్చాయని తెలిసింది. వాస్తవంగా విద్యుత్ తనిఖీ అధికారులు భవనాల్లో వైరింగ్, పరికరాల నాణ్యత, లోడ్ ఆధారంగా పరిశీలించి ధ్రువీకరణ పత్రం ఇస్తేనే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదంతా క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిగి అప్రూవల్స్ ఇవ్వాలి.
సరూర్‌నగర్ సర్కిల్‌కు సంబంధించి ఓ ఫైల్ విషయంలో అక్కడి విద్యుత్ అధికారి సీఈఐజీ కార్యాలయానికి ఇటీవల ఒక లేఖ రాశారు. తమ పరిధిలో ఒక కాంట్రాక్టర్ కనెక్షన్ కోసం పెట్టిన దరఖాస్తులో సీఈఐజీ అప్రూవల్ విషయంలో తమకు అనుమానాలున్నాయని తెలుపుతూ వాటిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేస్తే అందులో వివరాలేవీ రాకపోవడంతో ఆ అధికారి అనుమానం వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు చెప్పారు. ఇది ఒక్క సరూర్‌నగర్ సర్కిల్లో ఒక భవనానికి సంబంధించి వ్యవహారమే కాదు. అదే సర్కిల్‌తోపాటు నగరంలోని పలు సర్కిళ్లలో సీఈఐజీ అప్రూవల్స్‌తో కనెక్షన్లు తీసుకున్నారని విద్యుత్ తనిఖీ అధికారి కార్యాలయంలో చర్చ జరుగుతున్నది.
డిప్యూటీ సీఈఐజీ, సీఈఐజీ లేని మే, జూన్, జూలై నెలల్లో సుమారుగా వందకు పైగా బిల్డింగులకు నకిలీ పత్రాలతో కనెక్షన్లు తీసుకున్నట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే డిజిటల్ సంతకాలు ఎలా ఫోర్జరీ చేస్తారనే విషయంలో ప్రస్తుతం చర్చ జరుగుతుండగా.. విద్యుత్ అధికారులు తాము కనెక్షన్స్ ఇచ్చే సమయంలో క్యూఆర్‌కోడ్ స్కాన్ చేయాలి. వెంటనే ఆ లాగిన్‌లో ఉన్న బిల్డింగ్ వివరాలు, లోడ్ ఇతర వివరాలన్నీ కనిపిస్తాయి. కానీ ఈ నకిలీ పత్రాలకు అవేవీ కనిపించవు. ఇదంతా డివిజన్ స్థాయి అధికారులకు తెలిసి వారి సహకారంతో, సీఈఐజీ కార్యాలయ సిబ్బందిలో కొందరి ప్రమేయంతో నకిలీ పత్రాలు చెలామణి అయ్యాయి. ధ్రువీకరణ పత్రాలు నకిలీవా, అసలువా అనేది ఎస్పీడీసీఎల్ అధికారులు నిర్ధారించాల్సి ఉండగా.. వారు కూడా క్షేత్రస్థాయిలో కొందరు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై డబ్బుల దందా చేయడంతో వెలుగుచూడలేదు. ఇటీవల ఒక డివిజన్లో లావాదేవీల్లో తేడా రావడంతో నకిలీలు బయటపడ్డాయి.
సీఈఐజీ నుంచి వచ్చిన అప్రూవల్స్ విషయంలో తాము పెద్దగా పట్టించుకోమని, అవి సరైనవా లేదా చెక్ చేయకుండానే అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి తాము కనెక్షన్లు ఇచ్చినట్లు విద్యుత్ అధికారులు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో తమ అధికారులు తనిఖీలు చేయకుండానే సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని సీఈఐజీ నందకుమార్ తమ సిబ్బందిని ఆరా తీసినట్లు తెలిసింది. అయితే కొందరు కాంట్రాక్టర్లు, విద్యుత్, సీఈఐజీ సిబ్బందితో కలిసి వినియోగదారుల అవసరాన్ని బట్టి గృహ సముదాయాలకు లోడ్‌ను బట్టి రూ.1.5లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ విషయాలేవీ బయటకు రాకుండా ఇన్నిరోజుల నుంచి ఎస్పీడీసీఎల్ సర్కిల్ అధికారులు కొందరు, సీఈఐజీ సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై వ్యవహరం నడిపారు. నకిలీలు వెలుగుచూడటంతో వినియోగదారులకు కనెక్షన్లు కట్ చేస్తే అది రెండు విభాగాలకు సమస్యగా మారి రచ్చ అవుతున్నది. కాబట్టి దీనిపై తామే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు ఉన్నతాధికారులు, పోలీసులకు సిఫారసు చేయడానికి నిర్ణయించినట్లు సమాచారం.