ఖైరతాబాద్, ఏప్రిల్ 10 : నిలువ నీడ లేని నిరుపేదలకు చెందాల్సిన డబుల్ గృహాలు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులకు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులెందరో దరఖాస్తు చేసుకొని ఎమ్మెల్యే, మంత్రుల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. ఫలించలేదు. పేదలకు చెందాల్సిన ఆ గృహాలు స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులకు ‘దానం’ గా అందించినట్లు తెలిసింది. తమ కండ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్నామని తెలిసినా.. సంబంధిత శాఖ అధికారులు మౌనం పాటించినట్లు సమాచారం.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్ కాలనీలో ప్రతిష్ఠాత్మకంగా డబుల్ బెడ్రూం గృహాలను నిర్మించారు. ఏ బ్లాక్‌లో 30, బీ బ్లాక్‌లో 80, సీ బ్లాక్‌లో 40, డీ బ్లాక్‌లో 60 గృహాలను సిల్ట్ +5 అంతస్తుల్లో మొత్తం 210 గృహాలను అన్ని హంగులు, సౌకర్యాలతో నిర్మించారు. 2022 ఫిబ్రవరి 3న అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ చేతుల మీదుగా 202 మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. కాగా, డీ బ్లాక్‌లో ఎనిమిది గృహాలు ఇంకా ఎవరికి కేటాయించలేదు.
అర్హులైన నిజమైన పేద లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే వారికి అందజేస్తామని అప్పటి కలెక్టర్ తెలిపారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే.. 2023లో ప్రభుత్వం మారిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు మిగిలిన ఎనిమిది డబుల్ గృహాల కోసం దరఖాస్తు చేసుకొని ప్రస్తుత ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటి చుట్టూ రెండేండ్లుగా చెప్పులరిగేలా ప్రదక్షిణలు చేశారు. రేపు మాపు అంటూ.. దాట వేసి చివరకు సదరు ప్రజాప్రతినిధి తన అనుచరులకు కట్టబెట్టాడంటూ లబ్ధిదారులు బహిరంగంగాఆరోపిస్తున్నారు.
డబుల్ బెడ్రూం గృహాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలంటే అనేక కఠినమైన నిబంధనలు ఉన్నాయి. గృహ రహిత పేద కుటుంబాలు, దారిద్య్ర రేఖకు దిగువన, పక్కా ఇండ్లు లేని వారు, దివ్యాంగులు, వితంతువులకు కేటాయించాలి. లబ్ధిదారుల ఎంపికలోనూ అనేక నియమాలు ఉన్నాయి. అధికారుల ఫీల్డ్ వెరిఫికేషన్ తప్పని సరి.. వార్డు స్థాయిలో ప్రజలతో సభ నిర్వహించి, కలెక్టర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత పారదర్శకంగా పబ్లిక్ మీటింగ్‌లో కలెక్టర్ సమక్షంలో లబ్ధిదారులకు అందజేస్తారు. కానీ ఇందిరానగర్ డబుల్ గృహాల కేటాయింపులో ఆ నిబంధనలేవి పాటించనట్లు తెలుస్తున్నది.
ప్రజల సమక్షంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన డబుల్ బెడ్రూం గృహాల పత్రాలు, తాళాలు రహస్యంగా ప్రస్తుత ఇన్చార్జి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఖైరతాబాద్ తహసీల్దార్ సాక్షిగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరులకు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గృహాలు పొందిన వారిలో స్థానిక ప్రజాప్రతినిధుల బంధువులు, ఎమ్మెల్యే దగ్గరి అనుచరులు, అధికార పార్టీకి చెందిన వారు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఖైరతాబాద్ తహసీల్దార్‌ను వివరణ కోరగా, మంత్రి క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులకు డబుల్ గృహాలకు సంబంధించిన పత్రాలు, తాళాలు అందించినట్లు తెలిపారు.