High BP Symptoms | హైబీపీ అనేది ప్రస్తుతం సైలెంట్ కిల్లర్‌లా మారింది. ఇది ఉన్నట్లు కూడా చాలా మందికి తెలియడం లేదు. దీంతో లక్షణాలు తెలియడం లేదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ల బారిన పడుతున్నారు. ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది హైబీపీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి హైబీపీ ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక హైబీపీ ఉన్నవారిలో 12 శాతం మంది మాత్రమే బీపీని కంట్రోల్లో ఉంచుకుంటున్నారట. మిగిలిన వారికి అసలు బీపీ కంట్రోల్లో ఉండడం లేదని చెబుతున్నారు. కాబట్టి బీపీ ఉన్నవారు కచ్చితంగా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలను కోల్పోతారు.
చాలా మంది రాత్రి పూట మూత్ర విసర్జనకు నిద్ర లేస్తుంటారు. టైప్ 1 లేదా 2 డయాబెటిస్ ఉన్నవారు సహజంగానే రాత్రి పూట మూత్ర విసర్జనకు నిద్ర లేస్తారు. కానీ ఈ వ్యాధులు లేకున్నా రాత్రి పూట మెళకువ వస్తుందంటే మీకు హైబీపీ ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోండి. సాధారణంగా ఇలాంటి వారిలో 40 శాతం మందికి హైబీపీ ఉంటుందట. కనుక మీకు కూడా ఈ లక్షణం ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి. ఇక హైబీపీ ఉన్నవారికి ఛాతిలో నొప్పిగా ఉంటుంది. ఛాతిపై బరువు పెట్టినట్లు అనిపిస్తుంది. దీని వల్ల కిడ్నీలు, మెదడు, గుండెపై ప్రభావం పడుతుంది. అయితే కొందరు ఛాతిలో వచ్చే నొప్పిని గ్యాస్ నొప్పిగా భ్రమపడుతుంటారు. కానీ ఈ తరహా నొప్పి వస్తే బీపీ ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవాలి. దీంతో ముందుగానే జాగ్రత్త తీసుకున్నవారు అవుతారు.
హైబీపీ సమస్య ఉంటే చాలా మందికి తలతిరిగినట్లు అనిపిస్తుంది. ఒళ్లంతా చెమటలు పడుతుంటాయి. ఈ సమస్య గనక ఉంటే బీపీగా అనుమానించాల్సిందే. హైబీపీ ఉన్నవారిలో సుమారుగా 50 శాతం మందికి తలతిరిగే సమస్య ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక మీకు కూడా ఇలాంటి లక్షణం ఉంటే జాగ్రత్త పడండి. నిర్లక్ష్యం వహించకండి. అలాగే హైబీపీ ఉంటే రక్త సరఫరా సరిగ్గా ఉండదు. దీంతో కంటి చూపు స్పష్టంగా ఉండదు. కళ్లు మసకబారినట్లు కనిపిస్తాయి. చూపు మందగిస్తుంది. మీకు ఇలాంటి లక్షణం ఉంటే బీపీ ఉందేమో చెక్ చేయించుకోండి.
ఇక హైబీపీ ఉన్నవారు చాలా జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్లు ఇచ్చిన మందులను వాడడంతోపాటు తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను తింటుండాలి. ముఖ్యంగా పొటాషియం అధికంగా ఉండే అరటి పండు వంటి ఆహారాలను తింటుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. అలాగే వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం చేయడం వంటివి కూడా పాటించాలి. ఈవిధంగా సూచనలు పాటిస్తే హైబీపీ కంట్రోల్ అవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.