Weight Loss | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. శరీరంలో పేరుకుపోయిన మొండికొవ్వును కరిగించేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. అయితే అధిక బరువు లేదా పొట్ట దగ్గరి కొవ్వును కరిగించేందుకు గాను చాలా మంది అనేక రకాల పద్ధతులను పాటిస్తుంటారు. కొందరు యోగా చేస్తారు. ఇంకా కొందరు జిమ్‌లో వ్యాయామాలు చేస్తారు. మరికొందరు రన్నింగ్, జాగింగ్ వంటివి చేస్తుంటారు. అయితే ఇవన్నీ చేసేందుకు టైమ్ లేదు అనుకునే వారు ఇప్పుడు చెప్పబోయే సూచనలను పాటిస్తే చాలు, దాంతో అధిక బరువును లేదా పొట్ట దగ్గరి కొవ్వును సులభంగా కరిగించుకోవచ్చు. ఇక ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఆఫీసుల్లో లేదా ఇతర చోట్లలో మెట్లను ఎక్కేందుకు లిఫ్ట్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే అలా కాకుండా లిఫ్ట్ వాడకుండా మెట్లపై నడిచి వెళ్లాలి. దీంతో అధిక శాతం క్యాలరీలు ఖర్చువుతాయి. సాధారణ వాకింగ్ ను 30 నిమిషాలు చేసే బదులు 15 నిమిషాల పాటు మెట్లు ఎక్కి దిగితే ఎంతో ఫలితం ఉంటుందని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. కనుక మీరు లిఫ్ట్‌ను తరచూ వాడుతుంటే అందుకు బదులుగా మెట్లను ఉపయోగించండి. మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. అలాగే ఆఫీస్‌లో ఇంటర్‌కామ్ ఉంటే దాన్ని వాడకుండా మీ తోటి ఉద్యోగుల వద్దకు నడిచి వెళ్లే ప్రయత్నం చేయండి. ఇలా చేసినా కూడా క్యాలరీలు ఖర్చవుతాయి. బరువు తగ్గుతారు.
సాధారణంగా చాలా మంది చిన్నపాటి దూరానికే వాహనాలను వాడుతుంటారు. అలా కాకుండా సైకిల్‌ను ఉపయోగించండి. దీంతో చాలా ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. చిన్నపాటి దూరాలను నడకతో లేదా సైకిల్‌ను వాడి పూర్తి చేయండి. ఇవి క్యాలరీలను ఎక్కువగా కరిగిస్తాయి. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. అలాగే మీకు ఏదైనా అవసరం ఉంటే మీ పిల్లలను షాప్‌కు పంపించకండి. మీరే స్వయంగా నడిచి వెళ్లి తెచ్చుకోండి. దీని వల్ల క్యాలరీలను ఖర్చు చేసిన వారవుతారు. అదేవిధంగా ఇంట్లో పెంపుడు కుక్క ఉంటే దాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లండి. దీని వల్ల కూడా ఎంతో కొంత క్యాలరీలను ఖర్చు చేయవచ్చు.
ఇక ఇంట్లో మహిళలు చేసే పనులను సిగ్గు పడకుండా చేయండి. దీని వల్ల కూడా క్యాలరీలు ఖర్చవుతాయి. ఇంట్లో అంట్లు తోమడం, కూరగాయలు కట్ చేయడం, తోటపని, ఇంటి పని ఇలా అన్ని రకాల ఇంటి పనులను భార్యా భర్త సమానంగా చేయండి. దీంతో ఓవైపు పని పూర్తవుతుంది, మరోవైపు క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. అలాగే మీకు సెల్ఫోన్లో బాగా మాట్లాడే అలవాటు ఉంటే వాకింగ్ చేస్తూ మాట్లాడండి. దీంతో రెండు పనులు పూర్తవుతాయి. అదేవిధంగా మీకు వాహనం ఉన్నప్పటికీ ప్రజా రవాణాను రోజూ ఉపయోగిస్తుంటే ఎంతో కొంత క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. ఇలా పలు రకాల పనులను చేస్తే చాలు, మీరు జిమ్‌కు వెళ్లకుండానే బరువును తగ్గించుకోవచ్చు. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరిగిపోతుంది.