Healthy Foods | నేటి తరుణంలో ఆరోగ్యం మీద శ్రద్దతో మనలో చాలా మంది పోషకాలు కలిగిన ఆహారాన్ని, హెర్బల్ టీలను తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు భవిష్యత్తులో కూడా అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని భావిస్తారు. ఇలా చక్కటి ఆహారాన్ని తీసుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక, అనారోగ్య సమస్యలు తగ్గక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణం ఆహారాలను తీసుకునే సమయం, తీసుకునే పరిమాణం, ఎంత తరచుగా తింటున్నారు, వాటిని ఏ రూపంలో తీసుకుంటున్నారు.. అనే అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అంశాలన్నీ కూడా మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా హానిని కలిగిస్తాయా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కనుక సరైన ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఈ అంశాలన్నింటినీ గుర్తించుకోవాలి. మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాలను తీసుకునే సరైన విధానం గురించి వైద్యులు వివరిస్తున్నారు.
మనలో చాలా మంది బరువు తగ్గడానికి గ్రీన్ టీని తీసుకుంటూ ఉంటారు. రోజుకు 1 నుండి 3 కప్పుల గ్రీన్ టీ ను తీసుకోవచ్చు. అయితే ఈ గ్రీన్ టీని ఆహారం తీసుకోవడానికి ముందు తీసుకోవాలే తప్ప భోజనంతో పాటు తీసుకోకూడదు. మనం తీసుకునే ఆహారం, దాని ఉష్ణోగ్రత గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను ప్రభావితం చేస్తాయి. అలాగే తిన్న తరువాత గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల మన శరీరం మనం తీసుకున్న ఆహారాల్లో ఉండే ఐరన్ ను సరిగ్గా గ్రహించదు. అలాగే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల కొందరిలో వికారం వంటి భావన కలుగుతుంది. కనుక ఎక్కువ మొత్తంలో దీనిని తీసుకోకపోవడమే మంచిది. రోజూ ఒక గుప్పెడు లేదా 20 నుండి 30 గ్రాముల నట్స్ ను మాత్రమే తీసుకోవాలి. నట్స్ ను తీసుకోవడం వల్ల ఫైబర్, మంచి కొవ్వులు, సూక్ష్మ పోషకాలు వంటివి లభిస్తాయి. వీటిని తక్కువగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక మార్కెట్ లో మనకు మసాలా నట్స్, చాక్లెట్ పూత వేసిన నట్స్, ఉప్పు చల్లిన నట్స్ లభిస్తూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడానికి బదులుగా హాని కలుగుతుంది. కనుక తక్కువ మొత్తంలో ఎటువంటి ఫ్లేవర్స్ లేని నట్స్ ను తీసుకోవడం మంచిది.
తక్కువ పాలిష్ చేసిన ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఉండే ఫైబర్ చక్కటి పేగు ఆరోగ్యానికి దోహదపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే బ్రౌన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ తో చేసిన బ్రెడ్ ను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటిని మైదాపిండితో తయారు చేసి క్యారమెల్ రంగులను కలుపుతారు. కనుక తృణ ధాన్యాలతో చేసిన ఆహారాలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెరుగలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీర జీవక్రియ పెరుగుతుంది. అయితే మార్కెట్ లో మనకు చక్కెర కలిపిన పెరుగు లభిస్తుంది. దీనిలో చక్కెర కారణంగా క్యాలరీలు అధికంగా ఉంటాయి. కనుక ఇంట్లో తయారు చేసుకున్న సాదా పెరుగును తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ తో పాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. చర్మం, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే పండ్లను మనం నేరుగా నమిలి తిన్నప్పుడే ఈ మేలు మనకు జరుగుతుంది. చాలా మంది మార్కెట్ లో లభించే పండ్ల రసాలను తీసుకుంటూ ఉంటారు. వీటిలో చక్కెరతో పాటు ఫ్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఉండదు. అదనంగా క్యాలరీలు వచ్చి చేరుతాయి. కనుక పండ్ల రసాలను తీసుకోకపోవడమే మంచిది. ఆకుకూరలను తేలికగా ఉడికించి తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఉడికించడంవల్ల వీటిలో ఉండే సూక్ష్మ పోషకాలు ఆవిరైపోతాయి. కనుక వీటిని కొద్దిగా ఉడికించి తీసుకోవడం మంచిది. అలాగే సలాడ్ రూపంలో తీసుకోవడం మంచిది. అదేవిధంగా కొన్ని ఆకుకూరల్లో ఆక్సలైట్లు ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఆకుకూరలను తేలికగా ఉడికించి తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.
ఈ విధంగా మనం తీసుకునే ఆహారాలు మంచివే అయినప్పటికీ వాటిని తీసుకునే సమయం, పరిమాణం, వాటిని తీసుకునే రూపం కూడా మన ఆరోగ్యాన్నిప్రభావితం చేస్తుంది కనుక ఆహారాలను తీసుకునే విధానాన్ని సరి చేసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు.