Liquorice | మన వంట ఇంట్లో ఉండే అనేక మసాలా దినుసులు, ఇతర పదార్థాలతోపాటు ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఔషధాలుగా ఉపయోగిస్తుంటారు. ఆయా పదార్థాలు లేదా మూలికల్లో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇక మూలికల్లో పలు శక్తివంతమైన మూలికలు కూడా ఉంటాయి. వాటిల్లో అతి మధురం కూడా ఒకటి. అతి మధురం మనకు ఆయుర్వేద మందుల షాపుల్లో వేర్లు లేదా పొడి రూపంలో లభిస్తుంది. ఇది అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అతి మధురంతో పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో అతి మధురం అద్బుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని శక్తివంతమైన మూలికగా చెబుతుంటారు. పేరుకు తగినట్లుగానే ఇది తియ్యగా ఉంటుంది. కనుకనే దీనికి అతి మధురం అనే పేరు వచ్చింది. దీన్నే మధుయష్టి, యష్టిమధు, మధూక, ములేథి, లిక్కరైస్ అనే పేర్లతోనూ పిలుస్తారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
అతి మధురం చూర్ణం, వస చూర్ణంలను సమాన భాగాల్లో తీసుకుని కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పావు టీస్పూన్ చొప్పున రోజుకు 3 పూటలా తగినంత తేనెతో కలిపి తీసుకుంటుండాలి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అతి మధురం, అశ్వగంధ, శొంఠి చూర్ణాలను సమాన భాగాల్లో తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని అర టీస్పూన్ నుంచి ఒక టీస్పూన్ మోతాదులో అర కప్పు పాలతో కలిపి రోజుకు 2 సార్లు తీసుకుంటుండాలి. దీని వల్ల కీళ్లు, కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కీళ్లు, కండరాల నొప్పులు తగ్గుతాయి. నీరసం, అలసట నుంచి బయట పడవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది.
సోంపు గింజలను చూర్ణంగా చేసి దానికి రెట్టింపు మోతాదులో అతి మధురం చూర్ణం, పటికబెల్లం కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని ఉదయం, సాయంత్రం ఒక టీస్పూన్ మోతాదులో అర కప్పు నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆయాసం, దగ్గు, త్రేన్పులు కూడా తగ్గుతాయి. అతి మధురం చూర్ణాన్ని రోజుకు 3 సార్లు పూటకు ఒక టీస్పూన్ మోతాదులో అర కప్పు నీటిలో కలిపి తాగుతుండాలి. దీని వల్ల అధిక దాహం, వెక్కిళ్లు తగ్గిపోతాయి. నోటి పూత, నోట్లో పుండ్లు సమస్య నుంచి బయట పడవచ్చు. కడుపులో మంట, అధిక వేడి, చర్మంపై వచ్చే దురదలు, దద్దుర్లను తగ్గించుకోవచ్చు.
అర కప్పు పాలను తీసుకుని అందులో అర టీస్పూన్ మోతాదులో అతి మధురం చూర్ణాన్ని కలిపి ఆ పాలను రోజుకు 2 సార్లు తాగుతుండాలి. దీని వల్ల బాలింతల్లో పాలు బాగా పడతాయి. బియ్యం కడిగే నీళ్లతో అతి మధురం చూర్ణాన్ని కలిపి తీసుకోవాలి. దీని వల్ల ముక్కు, నోరు, చిగుళ్ల నుంచి అయ్యే రక్త స్రావం తగ్గుతుంది. స్త్రీలలో రుతు సమయంలో అధిక రక్త స్రావం జరగకుండా ఆపవచ్చు. అతి మధురం చూర్ణంలో నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి దాంతో దంతాలను సైతం తోముకోవచ్చు. దీని వల్ల దంతాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. నోట్లోని బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. పిప్పి పళ్ల సమస్య తగ్గిపోతుంది. దంతాలు, చిగుళ్ల నుంచి అయ్యే రక్త స్రావం తగ్గుతుంది. అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూను చూర్ణం, ఒక టీస్పూను పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. ఇలా అతి మధురం మనకు ఎంతో మేలు చేస్తుంది. అనేక లాభాలను అందిస్తుంది.