Diabetes | ప్రస్తుత తరుణంలో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయస్సులో ఉండే వారికి కూడా మధుమేహం వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అస్తవ్యస్తమైన జీవనశైలే అని చెప్పవచ్చు. సరైన ఆహారం తీసుకోకపోవడం, వేళ తప్పించి ఆలస్యంగా భోజనం చేయడం, రాత్రి పూట ఆలస్యంగా తినడం, జంక్ ఫుడ్‌ను ఎక్కువగా తినడంతోపాటు మద్యపానం, ధూమపానం, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా డయాబెటిస్ వస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే టైప్ 1 డయాబెటిస్ అయితే కచ్చితంగా జీవితాంతం మందులను వాడాలి. కానీ టైప్ 2 డయాబెటిస్ అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే టైప్ 2 డయాబెటిస్‌ను వెనక్కి మళ్లించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఇందుకు గాను పలు చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది.
డయాబెటిస్‌ను తగ్గించడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కణాలు యాక్టివ్‌గా పనిచేస్తాయి. ఇన్సులిన్‌ను శోషించుకుంటాయి. దీంతో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజుకు 2 సార్లు తాగుతుండవచ్చు. అలాగే మీరు తినే ఆహారాలపై కాస్త దాల్చిన చెక్క పొడిని చల్లి తినవచ్చు. దాల్చిన చెక్క డయాబెటిస్‌ను అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు పండ్లు మనకు వేసవి సీజన్లో లభిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే ఈ పండ్లకు చెందిన విత్తనాల పొడి మనకు మార్కెట్లో ఎప్పుడైనా లభిస్తుంది. ఈ పొడిని నీటిలో కలిపి రోజుకు 2 సార్లు తాగుతుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు నేరేడు పండ్ల విత్తనాలు ఒక వరం అనే చెప్పవచ్చు. ఇవి షుగర్‌ను సమర్థవంతంగా అదుపు చేస్తాయి.
డయాబెటిస్ నియంత్రణలోకి రావాలంటే మెంతులను కూడా తీసుకోవచ్చు. రోజూ రాత్రి పూట నీటిలో ఒక టీస్పూన్ మెంతులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను తిని ఆ నీళ్లను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే కచ్చితంగా 2 వారాల్లో చెప్పుకోదగిన మార్పు కనిపిస్తుంది. డయాబెటిస్ బార్డర్ లైన్లో ఉన్నవారు ఈ చిట్కాలను పాటిస్తే మందులను వాడాల్సిన అవసరం రాదు. అలాగే షుగర్‌ను అదుపు చేసేందుకు కాకరకాయ కూడా పనిచేస్తుంది. రోజూ 30 ఎంఎల్ మోతాదులో కాకర జ్యూస్‌ను సేవిస్తుండాలి. ఉదయం పరగడుపున సేవిస్తుంటే షుగర్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది.
షుగర్‌ను తగ్గించడంలో పసుపు కూడా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపులో కర్క్యుమిన్ అధికంగా ఉంటుంది. ఇది షుగర్‌ను పూర్తిగా అదుపు చేస్తుంది. పసుపును నీటిలో వేసి మరిగించి తాగుతుంటే షుగర్‌ను అదుపు చేయవచ్చు. లేదా రాత్రి పూట పాలలో పసుపు కలిపి కూడా తాగవచ్చు. అయితే పాలు కొవ్వు తీసినవి అయి ఉండాలి. అలాగే తులసి ఆకులు కూడా షుగర్‌ను అదుపు చేస్తాయి. ఉదయాన్నే పరగడుపునే తులసి ఆకుల రసాన్ని సేవిస్తుంటే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. తులసి ఆకుల్లో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి డయాబెటిస్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. ఇలా పలు చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరిస్తే షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.