Heart Attack | ఇటీవల హైదరాబాద్‌లో ఆకస్మాత్తుగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. అక్కడే ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేసి అతడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ట్రాఫిక్ పోలీసును అభినందించారు. గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పలువురికి సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ఖలీల్‌వాడి, మార్చి 6: దేశవ్యాప్తంగా సడెన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం పలువురు గుండెనొప్పితో చనిపోతున్నారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే బతికే అవకాశాలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కార్డియాక్ అరెస్ట్ నుంచి ప్రజలను కాపాడేందుకు సీపీఆర్‌పై దృష్టి సారించింది. సీపీఆర్‌పై వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ కార్మికులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు తగిన ఏర్పాట్లను సైతం చేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో ఈనెల 13వ తేదీనుంచి శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం, గుండె కొట్టుకోవడంలో సమస్యలు ఏర్పడటం, గుండె కండరం దళసరిగా ఉండడం, కుటుంబీకులకు ఈ రకమైన పరిస్థితి ఉండడం, ఒత్తిడి వంటి ఏదో కారణంతో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఏర్పడుతుందని వైద్యులు అంటున్నారు. మనం తినే ఆహారం కూడా గుండెపోటు రావడానికి కారణమని తెలుపుతున్నారు. సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే గుండె మొత్తం ఒకేసారి పని చేయడం ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్, స్థూలకాయం, ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, మానసిక ఒత్తిడి, రక్తపోటు, మధుమేహం కారణంగా గుండె వ్యాధి లేని వారు కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తే కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. సీపీఆర్‌తో రోగి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు.
ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో నొప్పి, ఇబ్బందితో కుప్పకూలితే సమీపంలో ఉన్నవారు వెంటనే రెండు చేతులతో ఛాతిపై బలంగా నొక్కాలి. ఇలా 20 నుంచి 30 సార్లు చేయాలి. అనంతరం రెండు ముక్కు రంధ్రాలు మూసి నోటిలోకి గాలిని గట్టిగా ఊదాలి. ఇలా రెండు, మూడు సార్లు చేయాలి. ఇలా చేయడాన్ని సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) అంటారు. దీనిపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్నది. సీపీఆర్‌తో గుండెపై ఒత్తిడి పడి మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. అనంతరం రోగిని దవాఖానకు తరలించడం ద్వారా ప్రాణాలను కాపాడే వీలు ఉంటుంది.
ఎవరైనా ఆకస్మికంగా గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్నవారు వెంటనే సీపీఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకుంటుందని, దీంతో ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ సులభంగా చేసేందుకు వీలున్న టెక్నిక్. అది ఎలా చేయలో ఏ కొద్దిమందికో తప్ప చాలామందికి తెలియదు. దీంతో బాధితులు కండ్ల ముందే చనిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటున్నది. బాధితుల్లో కేవలం 2 నుంచి 5 శాతం మందికి మాత్రమే మన దేశంలో సీపీఆర్ అందుతున్నదని వైద్యులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. త్వరలో శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందేందుకు జిల్లా నుంచి ఐదుగురు వైద్యులు వెళ్లారు. వారు జిల్లాలో ఫ్రంట్‌లైన్ ఉద్యోగులైన పోలీసులు, మున్సిపల్ ఉద్యోగులు, ఇతర కార్మికులకు సీపీఆర్‌లో శిక్షణ ఇస్తారు. అనంతరం అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాలు, జిమ్‌లలో ఎంపిక చేసిన వారికి, 108 సిబ్బంది, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలందరికీ సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది.
ఎవరైనా గుండెపోటుకు గురై హఠాత్తుగా పడిపోతే సీపీఆర్ చేయడంతో బతికే అవకాశాలు ఉన్నాయి. రెండు చేతులతో రోగి ఛాతిపై బలంగా నొక్కాలి. ఇలా 20 నుంచి 30 సార్లు చేయడం వల్ల రక్త ప్రసరణ జరిగి గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. వెంటనే రోగిని దవాఖానకు తీసుకెళ్లాలి.
– సందీప్‌రావు, గుండె వైద్యనిపుణుడు
నిజామాబాద్ జిల్లాలోని 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ప్రభుత్వ దవాఖానల్లోని సిబ్బందికి సీపీఆర్‌పై త్వరలో శిక్షణ ఇస్తాం. పోలీసులు, మున్సిపల్ కార్మికులు, 108 సిబ్బంది, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు అందరికీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
– సుదర్శనం, డీఎంహెచ్‌వో, నిజామాబాద్