రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి శరీరంలో ఉన్న నీళ్లు అమాంతం హరించుకుపోతాయి. తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. చాలామందికి నీళ్లు తగినన్ని తాగాలనే విషయం తెలుసు. దీంతో దాహంగా అనిపించిన వెంటనే నీళ్లు తాగేస్తుంటారు. కానీ, పోషకాహార నిపుణుల అభిప్రాయంలో బాగా దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగడం ఒక్కటి మాత్రమే సరిపోదట. ఇక శరీరంలో నీటి శాతం బాగా పడిపోయినప్పుడు దాహంగా అనిపిస్తుంది. డీహైడ్రేషన్ అంటే ఇదే! దీని కారణంగా తలనొప్పి, కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్), మగత, బ్రెయిన్ ఫాగ్ (తల తిప్పడం), పని చేసే శక్తి తగ్గడం లాంటివి తలెత్తుతాయి. కాబట్టి శరీరం తగినంత హైడ్రేటెడ్‌గా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
పొద్దున నిద్ర లేవగానే నీళ్లు తాగాలి. రాత్రంతా నిద్రిస్తాం కాబట్టి, ఇలా చేయడం వల్ల శరీరం మళ్లీ రీహైడ్రేట్ అయిపోతుంది. తాజాగా అనిపిస్తుంది.
రోజుకు దాదాపు 12 నుంచి 15 గ్లాసుల నీళ్లు తాగే ప్రయత్నం చేయాలి. దీనికోసం హెచ్చరించడానికి అలారం లాంటిది ఏర్పాటు చేసుకుంటే మంచిది.
నీళ్లకు అదనంగా కీరదోస, సెలెరీ (కొత్తిమీరను పోలిన ఆకు), పుచ్చపండు లాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.
మూత్రం రంగును గమనిస్తూ ఉండాలి. శరీరంలో హైడ్రేషన్ స్థాయులకు సంబంధించి ఇది ఓ సంకేతంలా పనిచేస్తుంది.
మూత్రం లేత పసుపు రంగులో కానీ, స్వచ్ఛంగా కానీ ఉంటే శరీరంలో తగినంత హైడ్రేషన్ ఉన్నట్టు. గాఢమైన పసుపు, నారింజ రంగులో ఉంటే డీహైడ్రేషన్‌గా పరిగణించాలి.
ఇక శరీరంలో తగినంత హైడ్రేషన్ కోసం తాగే నీళ్లలో కరిగిపోయే ఎలక్ట్రోలైట్ ఎఫర్వెసెంట్ గోలీలు వేసుకోవచ్చు. అయితే, వీటిని వాడటానికి ముందు డాక్టర్ సలహా తప్పనిసరి.