Monsoon Diseases | వర్షాలను తలుచుకోగానే భావుకులకు కవిత్వం పొంగుకొస్తుంది. భోజన ప్రియులకు వేడివేడి వంటకాలు గుర్తుకొస్తాయి. పిల్లలకు కాగితం పడవలు తలపునకు వస్తాయి. అంటువ్యాధులు, అనారోగ్యాలు మాత్రం మనం తలుచుకోకుండానే దాడి చేస్తాయి. జాగ్రత్త.
రుతువులు మారిన ప్రతిసారీ సీజనల్ వ్యాధులు ముసురుకుంటాయి. అందులోనూ వర్షకాలం వచ్చిందంటే విష జ్వరాలు చుట్టుముడతాయి. చాలామందిలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ, మలేరియా కూడా వెంటాడతాయి. నీరు, ఆహారం కలుషితమయ్యే ఆస్కారం ఉండటంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ప్రబలుతాయి. దీనివల్ల టైఫాయిడ్ లాంటి జ్వరాలూ రావచ్చు. మిగతా రుతువులతో పోలిస్తే.. వర్షకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు అధికం. అందుకనే దీన్ని వ్యాధుల కాలంగా వర్ణిస్తారు. ఏ చిన్న సమస్యనూ నిర్లక్ష్యం చేయలేం. సకాలంలో గుర్తించి, సరైన వైద్యం అందిస్తే ఈ రుగ్మతలు తగ్గిపోతాయి.
వైరల్ ఫీవర్స్.. వైరల్ ఇన్ఫెక్షన్స్
తడి వాతావరణంలో వైరస్ వ్యాప్తి ఎక్కువ. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న రోగి తుమ్మినా, దగ్గినా ఆ తుంపర్ల ద్వారా వైరస్ అక్కడి కక్కడే కిందపడిపోతుంది. వాతావరణం తేమగా ఉన్నప్పుడు ఆ వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువ ఉంటుంది. దీంతో ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఒక ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే చాలు.. వెనువెంటనే పొరుగిళ్లకూ పాకిపోతుంది. వర్ష కాలంలో నాలుగు రకాల వైరల్ ఫీవర్స్ విజృంభిస్తాయి.
1.ఎడినో వైరస్
2. రైనో వైరస్
3. మెటానిమో వైరస్
4.ఆర్ఎస్వి (రెస్పిరేటరీ సిన్షీషల్ వైరస్)
..ఇవన్నీ దాదాపు ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి.
నిర్ధారణ: మల్టీప్లెక్స్ పీసీఆర్ పరీక్ష ద్వారా రోగికి సోకిన వైరస్ ఏ రకమైందో తెలుసుకోవచ్చు.
చికిత్స: వైరల్ ఫీవర్స్‌కు ప్రత్యేకించి ఎలాంటి చికిత్సా ఉండదు. రోగ లక్షణాల ఆధారంగా వైద్యం అందించడమే మార్గం. జ్వరం, జలుబు, దగ్గు తదితర సమస్యలు ఉన్నవారికి అవసరమైన మందులు అందిస్తారు.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్
వర్షాలు కురిస్తే వరద పారుతుంది. చెరువులు, కుంటలు తదితర జలాశయాలలోని నీరు కలుషితం అవుతుంది. వీధుల్లో నడుస్తున్నప్పుడు బురద నీటిని దాటినప్పుడు అప్పటికే పాదాలకు ఏర్పడిన చిన్నపాటి పగుళ్లు, ఇతర గాయాల గుండా నీటిలోని బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. చెరువులు, కుంటల్లో ఈత కొట్టినప్పుడు, స్నానం చేసినప్పుడు అందులోని బ్యాక్టీరియా కళ్లు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా జంతువుల మల, మూత్ర విసర్జనతో కలుషితమైన నీటి వల్ల ‘లెప్టోస్పైరోసిస్’ అనే బ్యాక్టీరియా సంబంధ ఇన్ఫెక్షన్ సోకే ఆస్కారం ఉంటుంది.
లక్షణాలు
నిర్ధారణ: ఐజీఎం ఫర్ లెప్టోస్పైరోసిస్ పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స: డాక్సీసైక్లిన్ అనే యాంటీబయోటిక్ మాత్ర రెండు పూటలా తీసుకోవాలి.
కలుషిత ఆహారం, నీళ్ల్లు..
వర్షకాలంలో నీరు ఇట్టే కలుషితం అవుతుంది. దీంతో ఈ నీటితో వండే ఆహారాలు విషతుల్యం అవుతాయి. అపరిశుభ్రమైన, కల్తీ వస్తువులతో తయారు చేసే ఆహార పదార్థాలు మరింత త్వరగా కలుషితంగా మారతాయి. వీటిని తీసుకోవడం వల్ల టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటిరైటిస్ వంటి వ్యాధులు దాపురిస్తాయి. అందుకని, సాధ్యమైనంత వరకూ బయటి తిండికి దూరంగా ఉండాలి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా తినాల్సి వచ్చినా.. వేడివేడిగానే తీసుకోవాలి. దీనివల్ల అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. చల్లటి పదార్థాలు అస్సలు తీసుకోవద్దు. వీధుల్లో అమ్మే పానీపూరి, మిర్చి బజ్జీ కూడా మంచిది కాదు. సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమం. బయటికి వెళ్తున్నప్పుడు నీళ్ల సీసా తీసుకెళ్లడం సురక్షితం.
టైఫాయిడ్ లక్షణాలు
నిర్ధారణ: బ్లడ్ కల్చర్ టెస్ట్ ద్వారా టైఫాయిడ్‌ను నిర్ధారించవచ్చు
చికిత్స: ఎజిత్రోమైసిన్ మాత్రలు ఏడు రోజులు తీసుకోవాలి. సెఫ్ట్రయాగ్జోన్ ఇంజక్షన్ కూడా సమర్థంగానే పనిచేస్తుంది.
డెంగీ
ఎయిడిస్ ఈజిప్టి దోమ వల్ల డెంగీ వస్తుంది. ఈ దోమ కాటు వల్ల చికున్ గున్యా, జికా వైరస్ వచ్చే అవకాశమూ ఉంది. అయితే ప్రతి ఎడిస్ ఈజిప్టి దోమలో డెంగీ వైరస్ ఉండదు. డెంగీ వైరస్ ఇన్ఫెక్షన్కు గురైన దోమ కుడితేనే డెంగీ వచ్చే ఆస్కారం ఉంటుంది. అలా ప్రభావితమైన దోమ ఒక్కసారి కుట్టినా డెంగీ జ్వరం వస్తుంది.
లక్షణాలు:
నిర్ధారణ: డెంగీ జ్వరాన్ని ఎన్ఎస్1 యాంటిజెన్ పరీక్షల ద్వారా నిర్ధారించవచ్చు. వారం తరువాత అయితే ఐజీఎం పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
చికిత్స: రక్తపోటు పడిపోకుండా తరచూ ద్రవపదార్థాలు ఇవ్వాలి. డెంగీకి ప్రత్యేక చికిత్స అంటూ లేదు. లక్షణాల ఆధారంగా వైద్యం చేయాల్సి ఉంటుంది. అతి తక్కువ మందికి మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది.
జాగ్రత్తలు
దోమ కాటు వ్యాధులు
వాననీరు ఇంట్లోని పూల కుండీలు, ప్రహరీ లోపలి చిన్నాచితక గోతుల్లో నిలిచిపోతుంది. దీంతో ఇంటి పరిసరాలు దోమలకు ఆవాసంగా మారుతాయి. దోమ కాటు వల్ల మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి విషజ్వరాలు వస్తాయి.
మలేరియా
ఆడ ఎనాఫిలెస్ దోమ కుట్టడం వల్ల మలేరియా వ్యాధి సంక్రమిస్తుంది. అయితే, ఈ దోమ ఒక్కసారి కుట్టినంత మాత్రాన మలేరియా వస్తుందనుకుంటే పొరపాటే. నిజానికి, ఇన్ఫెక్టెడ్ ఎడిస్ ఈజిప్టి దోమ కుట్టగానే డెంగీ వస్తుంది. ఆడ ఎనాఫిలెస్ దోమ తొమ్మిది సార్లు కుడితేనే మలేరియా వస్తుంది.
లక్షణాలు
సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చలి జ్వరం.
నిర్ధారణ: రాపిడ్ యాంటిజెన్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారించవచ్చు.
చికిత్స: నిపుణుల పర్యవేక్షణలో మూడు రోజులపాటు యాంటీ మలేరియా మాత్రలు తీసుకోవాలి.
చికున్ గున్యా
డెంగీ కారకమైన ఎడిస్ ఈజిప్టి దోమ కాటు వల్ల చికున్ గున్యా కూడా వస్తుంది. తీవ్రమైన కీళ్ల నొప్పులు, జ్వరం.. ప్రధాన లక్షణాలు. దీనికి కూడా లక్షణాల ఆధారంగానే చికిత్స చేస్తారు. చికున్ గున్యాను నిర్లక్ష్యం చేస్తే కీళ్ల నొప్పులు ఎక్కువ కాలం వేధిస్తాయి. ముందు జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన అలవాట్లు, పోషకాలతో కూడిన ఆహార విధానం, పరిశుభ్రమైన వాతావరణం, తక్షణ చికిత్స.. ఇవి మాత్రమే
వానల కాలంలో రక్షణ ఛత్రాలై మనల్ని కాపాడతాయి.
– డాక్టర్ టీఎన్‌జే రాజేష్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్
…?మహేశ్వర్‌రావు బండారి